Site icon NTV Telugu

Aam Admi Party: ‘మీ ముఖ్యమంత్రిని ఎన్నుకోండి’.. గుజరాత్‌ ఎన్నికల కోసం ఆప్‌ పోల్‌

Aam Admi Party

Aam Admi Party

Aam Admi Party: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీపై గెలిచేందుకు ఆప్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆప్‌ కన్వీనర్‌ గుజరాత్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్‌ మాదిరిగా తమ ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను ఆప్ కల్పించింది. శనివారం గుజరాత్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు క్రౌడ్ సోర్సింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం మీడియా సమావేశంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి’’ అని కోరారు. 6357000360 నంబర్ కు వాయిస్ మెస్సేజ్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లను నవంబర్ 3 నాటికి పంపించాలని సూచించారు.

రాష్ట్రంలో దూకుడుగా ప్రచారం చేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ, ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వంటి అనేక వాగ్దానాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్‌ కేజ్రీవాల్‌.. “మీ ముఖ్యమంత్రిని ఎంచుకోండి” అంటూ పోల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ ఎన్నికలకు ముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారిలో మీ మద్దతు ఎవరికో తెలియజేయాలని ఆప్ ప్రజలను కోరడం తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు భగవంత్ మాన్‌ను ఎంపిక చేసింది. ఈ తరహాలోనే గుజరాత్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, పనిలో పనిగా అధికార బీజేపీపై ఆయన విమర్శలు చేశారు.

Imran khan: భారత్‌పై ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి ప్రశంసల వర్షం.. ‘పాకిస్థానీలు బానిసలు’

తదుపరి ఐదేళ్ల విషయంలో బీజేపీ వద్ద ప్రణాళిక ఏదీ లేదని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని తొలగించి భూప్రేంద పటేల్‌ను నియమించారని.. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదన్నారు. కానీ తాము అలా చేయమని.. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందని అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారు గుజరాత్‌కి తదుపరి ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాబట్టి ఈ రోజు మీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో చెప్పాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు.182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పోలింగ్‌ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version