NTV Telugu Site icon

Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..

Akash Deep

Akash Deep

Akash Deep: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆకాశ్ దీప్, సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండడని భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఆకాశ్ దీప్ గైర్హాజరీ ఓ ఎదురుదెబ్బగా మారనుంది. గత రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అయితే, ఫీల్డింగ్‌లో కొన్ని కీలకమైన క్యాచ్‌లు జారవిడవడం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. బ్రిస్బేన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి చివరి వికెట్‌ భాగస్వామ్యంలో జట్టును ఫాలో-ఆన్ గండం నుంచి బయట పడేసాడు.

Also Read: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏమన్నదంటే ?

సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు సిడ్నీ టెస్టుకు ప్లేయింగ్‌-11పై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వెన్ను నొప్పితో ఆకాశ్ దీప్ దూరమైన కారణంగా హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఎవరో ఒకరికి తుది జట్టులో అవకాశం లభించే అవకాశం ఉంది. ఆకాశ్‌ దీప్ గైర్హాజరీతో భారత బౌలింగ్ విభాగంపై భారం మరింతగా పెరగనుంది. ఆస్ట్రేలియా మైదానాలు ఫాస్ట్ బౌలర్లకు సవాళ్లు విసురుతాయి. బౌలింగ్‌లో అధిక ఒత్తిడి కారణంగా మోకాలు, చీలమండలు, వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావడం సాధారణం. సిడ్నీ పిచ్ పరిస్థితులను గమనించిన తర్వాత మాత్రమే తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని హెడ్‌కోచ్ గంభీర్ పేర్కొన్నారు.
టీమిండియా చివరి టెస్టు కోసం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిడ్నీ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయడం కోసం టీమిండియా గెలుపు తప్పనిసరిగా మారింది.

Show comments