NTV Telugu Site icon

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ఏమైంది.. ప్రపంచకప్‌కు ఎంపికయితే ఆడరా?

India Team New

India Team New

Aakash Chopra React on Team India Players Form in IPL 2024: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 2007లో టీ20 ప్రపంచకప్‌ అందుకున్న భారత్.. అనంతరం ఫైనల్ కూడా చేరుకోలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని పటిష్ట జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా.. తాజాగా ఆటగాళ్ల ఫామ్ ఆందోళకు గురిచేస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ 2024 జట్టుకు ఎంపికైన భారత ఆటగాళ్లలో కొందరు ఐపీఎల్‌ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. జట్టును ప్రకటించిన తర్వాతి రోజు నుంచే విఫలవుతున్నారు. మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తన కెరీర్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న స్పెల్ వేశాడు. పేసర్ అర్షదీప్ సింగ్ సైతం ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడిన ఆల్‌రౌండర్‌ శివమ్ దూబె వరుసగా రెండుసార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. సంజూ శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఇక హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు.

Also Read: MI vs SRH: ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ ఛాన్స్‌కు ఎసరు వచ్చేనా?

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి టీ20 ప్రపంచకప్‌ 2024 జట్టుకు ఎంపికైన భారత ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాడు. ‘శివమ్ దూబే రెండు గోల్డెన్ డకౌట్స్ అయ్యాడు. రెండు సార్లు ఒకే జట్టుపై అవుట్ అవ్వడం విశేషం. స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ అతడిని పెవిలియన్ చేర్చారు. పంజాబ్‌పై చెన్నై పవర్‌ప్లేలో 60/1తో నిలిచింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా ఒక్కడే పోరాడాడు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నై మ్యాచ్‌లో అర్షదీప్ 10కి పైగా ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్‌కు ఎంపికైన తర్వాత భారత ఆటగాళ్లకు ఏమైంది?’ అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు.