Shraddha Walker Case: శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్య అనంతరం విచారణలో అఫ్తాబ్ పూనావాల్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన వెంటనే ఓ మహిళను తన ఫ్లాట్‌కు పిలిచి ఆమెతో అఫ్తాబ్ డేటింగ్ చేశాడు. ఆ మహిళ ఎవరనేది పోలీసులు కూపీ లాగడంతో ఆమె ఒక మానసిక వైద్యురాలిగా పోలీసులు గుర్తించారు. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ ‘బంబ్లే’ ద్వారా ఆ మహిళను అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఇదే బంబ్లే నుంచి రెండేళ్ల క్రితం శ్రద్ధను అఫ్తాబ్ కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధ హత్యకూ, ఈమెకీ సంబంధమేమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Cyber Crime: నరేశ్ చేతిలో దారుణంగా మోసపోయిన జీవిత రాజశేఖర్
అంతేకాదు, డేటింగ్ యాప్ ద్వారా మరికొందరు మహిళలను కూడా అఫ్తాబ్ కలిసినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో నిందితుడు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో-అనాలిసిస్ పరీక్షలను నిర్వహించారు. పోలోగ్రాఫ్ పరీక్షకు సంబంధించి అన్ని సెషన్లు పూర్తయ్యాయని, ప్రీ, మెయిన్, పోస్ట్ అనే మూడు స్టేజ్‌లు ఈ పరీక్షలో ఉంటాయని ఎఫ్ఎస్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు ఈ పరీక్షలను విశ్లేషించి రిపోర్ట్ రూపొందిస్తారని చెప్పారు. నివేదికపై నిపుణులు సంతృప్తి చెందనట్లయితే మరోసారి అఫ్తాబ్‌ను పిలిపిస్తామన్నారు. నివేదిక ఆధారంగా నార్కో అనాలసిస్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, అంబేద్కర్ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు సోమవారంనాడు నార్కో టెస్ట్ జరుపనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి పుర్రె, మిగిలిన శరీర భాగాలతో పాటు మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన మరో ఆయుధాన్ని పోలీసులు ఇంకా కనుక్కోలేదు. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు ఐదు కత్తులను వినియోగించినట్టు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, ఓ ఆయుధం ఇంకా లభ్యం కాలేదని తెలిపారు.