కేటీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, సవాల్ విసిరి వెనక్కి పోయే వ్యక్తి కేటీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ విషయం లో ఛాలెంజ్ విసిరి.. వెనక్కి పోయాడని, మీ సవాళ్లు ఎవరు నమ్మరన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మాట్లాడిన వాళ్లకు నోటీసులు ఇస్తున్నామని, జడ్జీల ఫోన్ లు కూడా ట్యాపింగ్ చేశారు మీరు, కేటీఆర్ నిజస్వరూపం బయట పడిందని ఆయన అన్నారు. అసందర్భ ప్రేలాపనలు మానుకో కేటీఆర్, బీజేపీ తో పొత్తు కోసం వెంపర్లాడటం నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. దానం నాగేందర్ బయటకు వచ్చింది.. బీజేపీ తో మీరు పొత్తు కు ప్రయత్నం చేస్తున్నారు అనే కదా..? అని ఆయన అన్నారు. ప్రజలు మీ వెంట లేరు..మీరు ఇంకా భ్రమల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో ఓడించారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ అవసరాల కోసం బెదిరించారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటపడుతున్నా కేటీఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాపాల పుట్ట మేడిగడ్డ రూపంలో పగిలిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కరువుతో అల్లాడాలని మామ, అల్లుడు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే ఆరు గ్యారెంటీల్లోని మిగతా హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.