NTV Telugu Site icon

Aadi Srinivas : కేసీఆర్‌ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు.. 

Aadi Srinivas

Aadi Srinivas

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్‌. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్ రావు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు. తప్పు జరిగిందని విచారణలో తేలితే కేసీఆర్  శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పైనే ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోతారా.? అని ఆయన ప్రశ్నించారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందేనని ఆది శ్రీనివాస్‌ అన్నారు. విచారణ నుంచి తప్పించుకునే కేసీఆర్ ప్రయత్నం బెడిసికొట్టిందని, భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిడుగులు పడకుండా టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల  అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి…బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.

అనంతరం మహబూబ్ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..  జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి  కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు..? అని, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేసీఆర్  అధిక ధరకు కొన్నాడన్నారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు నిజాలు బట్టబయలు అవుతాయనే కేసీఆర్ హాజరు కావడం లేదని, విద్యుత్ ఒప్పందాలలో తీసుకున్న కమిషన్ బయటకు వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. సొంత లాభం లేనిదే కేసీఆర్ ఏ పనిచేయడు, ఎవరినీ కలవడని, కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్రం 10 వేల కోట్లు నష్టపోయిందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చాడు..ఇందులో అవినీతి బయటపడుతుందని, యాదాద్రి పవర్ ప్లాంట్ లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. విద్యుత్ కేంద్రాల అవినీతి లో  కేసీఆర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే నిర్ణయాలు తీసుకున్నారని విచారణ లో అధికారులు స్పష్టం చేశారన్నారు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి.

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను కేసీఆర్ భయపెట్టే ప్రయత్నం చేశారని, పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రజలు ఇంటికి పంపించారన్నారు. రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఓడించడం ద్వారా తెలుగువారంతా తెలివి కల్ల వారని నిరూపించారని, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు లో అవినీతి పైన  ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం మా ప్రభుత్వం కేసీఆర్ కి ఇచ్చిందని, అసెంబ్లీ ఆమోదంతోనే జస్టిస్ నరసింహారెడ్డి  జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతోందన్నారు. చట్టబద్ద కమిషన్ ముందుకు రానని కేసీఆర్ అనడం అంటే రాజకీయ పార్టీ గా ఉండే బీఆర్ఎస్ కు లేదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా 30 వేల కోట్ల భారం తెలంగాణ ప్రజల పైన పడిందన్నారు.