పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు తనదైన రీతిలో ప్రచారం చేపట్టారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మామూలుగా హామీలు ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం కామన్. ఇక్కడ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా(డెమోక్రటిక్) అభ్యర్థి మాత్రం కాళ్లు వేళ్ల పడి ఓట్లు వేయమని ఓటర్లను బ్రతిమలాడుతున్నారు. మెడలో ఖాళీ బీరు సీసాల దండ వేసుకొని, షర్ట్ కు కరెన్సీ జిరాక్స్ నోట్లు అంటించుకుని అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్కుతా అంటు ఓటర్ల కాళ్ళ మొక్కుతు డబ్బుకు మద్యానికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నాడు. రోడ్డున పోయే ద్విచక్ర వాహనదారులను ఆపి మరి కాళ్లు పట్టుకుంటున్నాడు. ఆయన ప్రచారాన్ని జనాలు వింతగా చూస్తున్నారు.
READ MORE: PBKS vs RCB: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కీలక పోరు.. ప్లేఆఫ్ కోసం ఫైట్..!
ఎన్నికల ప్రచారంలో ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టకు అనే కరపత్రం పంచుతూ ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి లో మోతే నరేష్ ప్రచారం చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నరేష్ ఎంచుకున్న నినాదం బాగానే ఉన్నా, ఓటర్లు మాత్రం ఆయన ప్రచారానికి ఏ మేరకు స్పందిస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. ఇలాంటి ప్రచారాలు తరచూ ఇతర రాష్ట్రాల్లో చూస్తుంటాం.
కాగా.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ కృష్ణ, బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ తోపాటు 30 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, జన జాతర, జన గర్జన సభలు నిర్వహిస్తుండగా స్వతంత్ర అభ్యర్థులు మాత్రం వింత వినూత్నంగా ప్రచారం చేస్తు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు గెలస్తారో చూడాలంటే చివరి వరకు ఎదురు చూడాల్సిందే.