NTV Telugu Site icon

Flags: నిజమైన దేశభక్తి అంటే ఇది… శభాష్ రా బుడ్డోడా

Flag

Flag

రెండురోజుల క్రితమే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రతి ఒక్కరూ తమ ఛాతిపై చిన్న జెండాను పెట్టుకున్నారు. ఇంటిపై పెద్ద జెండాను హర్ ఘర్ తిరంగా అంటూ ఎగురవేశారు. అంతేకాదు తమ వాట్సప్ డీపీల్లో కూడా జాతీయ జెండాను పెట్టేసుకున్నారు. తరువాత రోజు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జెండాలను ఎక్కడ ఉంచామో కూడా గుర్తులేనంతగా తన పనుల్లో మునిగిపోయారు. కొందరైతే వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేశారు.

ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ జెండాలను ఎక్కడ పడితే అక్కడ వాడటం, ఎలా పడితే అలా ఉపయోగించడం, వాటిని తొక్కడం , పడేయడం ఒక విధంగా చెప్పాలంటే జాతీయ జెండాను అవమానించేలా ఏ పని చేసినా అది నేరమే. అయితే ఈ విషయంలో చట్టాలు అంత కఠినంగా లేకపోవడంతో చాలా మంది తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు మాత్రమే జెండాకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. తరువాత ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం తన దేశ భక్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ పిల్లవాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తు్న్నారు.

Also Read: Online Gaming Sites: భారీగా బాకీ పడిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు… నోటీసులు జారీ చేయనున్న కేంద్రం

వీడియోలో కొన్ని జాతీయ జెండాలు మురుగు కాలువలో పడిపోవడం మనం చూడవచ్చు. అయితే ఓ వ్యక్తి ఆ పిల్లవాడిని కాలువలో జాగ్రత్తగా దింపుతాడు. ఆ పిల్లాడు ఆ కాలువలో పడిపోయిన ప్రతి జెండాను తన చేతులతో స్వయంగా ఏరి తీసుకొని వస్తాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు నిజమైన దేశ భక్తి అంటే ఇది అంటూ ఆ బుడ్డోడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి పిల్లల్లో దేశభక్తిని నింపాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లయితే ఇలా జాతీయ జెండాలను పడవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా పడవేసిన వారికి శిక్ష వేయాలని, అసలు ఎవరికి పడితే వారికి జెండాలు అమ్మకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లక్షల మంది చూశారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.