తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కర్నాటక, మహారాష్ట్రలో ఆ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అదిపెద్ద తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పాలని ఆ సంస్థ నిర్ణయం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడానికి గానూ కావాల్సిన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. అందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని ప్రకటించారు.
Breaking News: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల..
అపోలో మైక్రోసిస్టమ్ సంస్థ యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ
హైదరాబాద్లోని టీఎస్ఐఐసీ ఏరోస్పేస్ పార్కులో అపోలో మైక్రోసిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ వల్ల రానున్న మూడేళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కోర్ రంగాలుగా ఉన్నాయని, ఈ రంగాల్లో అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయని పేర్కోన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, సాఫ్రాన్, జీఈ ఏవియేషన్ వంటి సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందని వివరించారు. ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డులను అందుకుందని తెలియజేశారు.