Karnataka Elections: సర్వే ఫలితాలను, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని రీతిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ ఏజ్‌లో నీకు టికెట్ ఎందుకు..? పోటీ నుంచి తప్పుకో అని ఎగతాలి చేసినవారికి సవాల్ చేసి మారీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 92 ఏళ్ల వ్యక్తి.. ఎవ్వరి ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని అందుకున్నారు.. అయనే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్.శివశంకరప్ప. ఆయనకు ఈ ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలే వచ్చాయి.. 92 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఎందుకు? ఎలా ఇస్తారు? ఆయనకు ఎవరైనా ఓటు వేస్తారా? ఆయన గెలిచి ఏం చేస్తారు? అని ఇంటా బయట నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. కానీ, మరోసారి విక్టరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు శివశంకరప్ప..
నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది.. భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ ఎన్నికల ప్రచారంలో చాలెంజ్ చేసిన శివశంకరప్ప.. ఆ చాలెంజ్‌ను నిలబెట్టుకున్నారు.. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకుని విమర్శించిన వారి నోళ్లను మూయించారు. ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు శివశంకరప్ప.. ఆయన దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. ఈసారి శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్‌కు 56,410 ఓట్లు వచ్చాయి. 27,888 ఓట్ల మెజార్టీతో ఆయన విజయాన్ని అందుకున్నారు..
లేటు వయస్సులో పోటీ చేసి గెలిచి రికార్డు సృష్టించిన శివశంకరప్ప.. పొలిటికల్ ఎంట్రీ కూడా కాస్తా లేట్ వయస్సులోనే ఇచ్చారు.. తొలిసారి 1994 కర్ణాటక ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేశారు. దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ, 1999లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.. అయితే, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక, 2008 నుంచి దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తూ వరుస విజయాలు నమోదు చేశాడు.. మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.. ఏదైనా ప్రజల్లో విశ్వాసం.. పని విధానాన్ని బట్టి వారి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంటారు..