NTV Telugu Site icon

Balanagamma Movie: ఎనభై ఏళ్ళ జెమినీ వారి ‘బాలనాగమ్మ’

Balanagamma

Balanagamma

Balanagamma Movie:  తెలుగునేలపై ‘బాలనాగమ్మ కథ’ తెలియనివారు అరుదనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయలపకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళాడనే కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైనా మాయ చేసే మాటలు పలికితే, “మాయలపకీరులా ఏం మాటలు నేర్చావురా?” అంటూ ఉంటారు. అలాగే ‘ఉంపుడు కత్తె’లను ‘సంగు’తో పోల్చడమూ వినిపిస్తుంది. బాలనాగమ్మను పతివ్రతగా కొలిచేవారున్నారు. ఇలాంటి మహత్తరమైన కథను తొలుత తెరపై చూపించిన ఘనత జెమినీ సంస్థ అధినేత ఎస్.ఎస్.వాసన్ కే దక్కుతుంది. అలనాటి అందాలతార కాంచనమాల నాయికగా రూపొందిన జెమినీవారి ‘బాలనాగమ్మ’ 1942 డిసెంబర్ 17న విడుదలై విజయఢంకా మోగించింది. తెలుగులో నేరుగా శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగానూ జెమినీవారి ‘బాలనాగమ్మ’ చోటు సంపాదించడం విశేషం!

‘బాలనాగమ్మ’ కథ ఏమిటంటే – నవభోజరాజు భార్య రాణి భూలక్ష్మి పిల్లల కోసం పరితపిస్తుంది. ఓ ముని సూచన మేరకు ఓ చెట్టు పండ్లు తినాలని కోసుకుంటూండగా, పుట్టపై కాలు వేసినందుకు నాగరాజు ఆగ్రహిస్తాడు. ఆమెను కాటు వేయబోతాడు. అయితే ఆమె వేడుకోలు విని, పిల్లలు పుట్టిన తరువాతే కాటు వేస్తానని అంటాడు నాగరాజు. రాణి ఏడుమంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. నాగరాజు ఆదేశానుసారం కడగొట్టు బిడ్డకు బాలనాగమ్మ అని పేరు పెడుతుంది. తరువాత రాణి కన్నుమూస్తుంది. బాల్యంలో పలు కష్టాలు పడ్డ నాగమ్మ తరువాత కార్యవర్ధిరాజు భార్య అవుతుంది.

ఆనందంగా వారి సంసారం సాగుతుంది. ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది బాలనాగమ్మ. ఆ బాబుకు బాలవర్ధి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. శత్రురాజులు దండెత్తి రాగా, యుద్ధానికి వెడతాడు కార్యవర్ధి రాజు. అదే సమయంలో తన మాయాదర్పంలో భూలోకంలోనే అందగత్తె అయిన నాగమ్మను చూసి, ఆమెను సొంతం చేసుకోవాలని ఆశిస్తాడు మాయలఫకీరు. భిక్షాందేహి అంటూ వచ్చి, నాగమ్మను కుక్కగా మార్చి తీసుకు వెళతాడు. అప్పటి వరకూ మాయలఫకీరు ప్రేయసిగా ఉన్న సంగూ సైతం అది తగదని చెబుతుంది.

కానీ, ఎలాగైనా బాలనాగమ్మను సొంతం చేసుకోవాలన్నదే పకీరు ఆశగా ఉంటుంది. అయితే నాగమ్మ తాను ఓ వ్రతం చేస్తున్నానని అందువల్ల ఓ పద్నాలుగేళ్ళు తనను సమీపించరాదని ఆన విధిస్తుంది. అందుకు ఫకీరు కూడా అంగీకరిస్తాడు. ఈ లోగా యుక్తవయస్కుడైన బాలవర్ధికి అతని తల్లి ఓ మాయలఫకీరు చెరలో ఉందన్న విషయం తెలుస్తుంది. సాహసోపేతంగా మాయలఫకీరు స్థావరం చేరుకుంటాడు. అక్కడ అతని ప్రాణం చిలకలో ఉందన్న రహస్యం తెలుసుకుంటాడు బాలవర్ధి. ఏడు సముద్రాలు దాటి, ఓ దీవిలోని మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలకలో మాయలఫకీరు ప్రాణం ఉందని తెలుసుకొని దానిని తెచ్చి వాడిని చంపేస్తాడు. బాలవర్ధి కారణంగానే రాళ్ళుగా మారిన కార్యవర్ధి, అతని సైన్యం మానవరూపం మళ్ళీ దాలుస్తారు. దాంతో బాలవర్ధి గొప్పతనాన్ని కన్నతండ్రితో పాటు అందరూ కొనియాడతారు. కథ సుఖాంతమవుతుంది.

Nikhil: పాన్ ఇండియా హీరోకు ఐకాన్ స్టార్ సపోర్ట్

ఇందులో మాయలఫకీరుగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, బాలనాగమ్మగా కాంచనమాల, కార్యవర్ధి రాజుగా బందా కనకలింగేశ్వర రావు, బాలవర్ధిగా మాస్టర్ విశ్వం, నవభోజ రాజుగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నటించగా, మిగిలిన పాత్రల్లో వెంకటకృష్ణమూర్తి, రేలంగి, లంకా సత్యం, వి.లక్ష్మీకాంతం, అడ్డాల నారాయణరావు, కర్రా సూర్యనారాయణ, పుష్పవల్లి, బళ్ళారి లలిత, కమలాదేవి తదితరులు ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన చేయగా, సాలూరి రాజేశ్వరరావు, ఎమ్.డి.పార్థసారథి సంగీతం సమకూర్చారు. “నాన్నా మేం ఢిల్లీకి పోతాము…”, “నా సొగసే కని మరుడే దాసుడు కాడా…”, “శ్రీజయజయ గౌరీ రమణా శివశంకర పావన చరణా…” అంటూ సాగే పాటలు విశేషాదరణ పొందాయి. ఆ రోజుల్లోనే భారీ సెట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులోని కెమెరా పనితనం గురించి పలు సంవత్సరాలు జనం మాట్లాడుకున్నారు. శైలేన్ బోస్, బి.యస్.రంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. యస్.యస్.వాసన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకునిగా తెరకెక్కించారు.

ఈ సినిమా పలు కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ ఆడిన తొలి తెలుగు చిత్రంగా ‘బాలనాగమ్మ’ నిలచింది. ఈ సినిమాతో కాంచనమాలకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు లభించాయి. ఇదే ఇతివృత్తంతో బాలనాగమ్మగా అంజలీదేవి, కార్యవర్ధిగా యన్టీఆర్, మాయలఫకీరుగా యస్వీఆర్ తో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 1959లో ‘బాలనాగమ్మ’ తెరకెక్కింది. తరువాతి రోజుల్లో ఈ కథను శ్రీదేవి నాయికగా సినిమా తీస్తానని దాసరి నారాయణరావు ప్రకటించారు. ఎందువల్లో అది కార్యరూపం దాల్చలేదు. బాలనాగమ్మ మళ్ళీ పుట్టినట్టు ఆమె కోసం మాయలఫకీరు వచ్చినట్టు కామెడీ కథతో ‘గోలనాగమ్మ’ తెరకెక్కింది. ఏది ఏమైనా జెమినీవారి ‘బాలనాగమ్మ’ చరిత్రలో ఓ మైలురాయిగా నిలచిపోయింది.