మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80 మంది విద్యార్థులు పోషకాహార కార్యక్రమం కింద బిస్కెట్లు తిని ఆసుపత్రిలో చేరారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులకు వికారం, వాంతులు వచ్చాయి. ఫిర్యాదు మేరకు గ్రామపెద్దలు, పరిపాలన అధికారులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ ఘుఘే మాట్లాడుతూ.. 257 మంది విద్యార్థులకు బిస్కెట్లు తిన్న ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయని తెలిపారు. వీరిలో 153 మందిని ఆసుపత్రికి తీసుకురాగా.. మరికొందరికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రమైన లక్షణాలతో ఉన్న ఏడుగురు విద్యార్థులను తదుపరి చికిత్స కోసం ఛత్రపతి శంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
READ MORE: Nellore: రూ.500 కడితే 7లక్షలు.. నెల్లూరులో మనీ స్కీం పేరుతో భారీ మోసం
కాగా.. ఆగస్టు 8 న, ఉత్తరప్రదేశ్‌లోని బాబా రాఘవ్ దాస్ (బిఆర్‌డి) మెడికల్ కాలేజీలో 8వ తరగతి చదువుతున్న శివమ్ యాదవ్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించాడు. అతను మహర్షి దేవ్రాహ బాబా మెడికల్ కాలేజీ నుంచి బదిలీపై వచ్చాడు. డియోరియా.. బరియార్‌పూర్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ స్కూల్‌లోని హాస్టల్‌లో ఆహారం తిని అస్వస్థతకు గురైన 90 మంది విద్యార్థులలో శివమ్ కూడా ఉన్నాడు.
