Site icon NTV Telugu

Fire Accident: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు

Fire Accident

Fire Accident

Fire Accident: రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. లక్ష్మణ్ విహార్‌లోని ఆదర్శ్ రెసిడెన్సీ హాస్టల్‌లో జరిగిన సంఘటనను గమనించిన కోట జిల్లా యంత్రాంగం.. భద్రతా చర్యలను పాటించకపోవడం, అగ్నిమాపక ఎన్‌ఓసి (నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన హాస్టల్‌కు సీలు వేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించిందని కోట మున్సిపల్ కార్పొరేషన్ అధికారి రాకేష్ వ్యాస్ తెలిపారు. కోట-సౌత్, కోటా-నార్త్‌లోని దాదాపు 2,200 హాస్టళ్లకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను పాటించనందుకు నోటీసులు అందాయని, ఈ హాస్టళ్లపై త్వరలో చర్యలు తీసుకుంటామని రాకేష్ వ్యాస్ తెలిపారు.

Read Also: Israel-Hamas War: హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదన..!

కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్‌మార్క్ సిటీ ప్రాంతంలో ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని కోట (సిటీ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమృత దుహాన్ తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి దారితీసిందని, ఫోరెన్సిక్ బృందం ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ భవనంలోనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోందని రాకేష్ వ్యాస్ అన్నారు. ఈ ఘటన రాత్రిపూట ఎప్పుడైనా జరిగి ఉంటే విషాదకరమైన మలుపు తిరిగి ఉండేదని ఆయన అన్నారు.

Read Also: Extra Peg Row: ‘ఎక్స్‌ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్

ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి స్వల్ప కాలిన గాయాలతో మహారావ్ భీమ్ సింగ్ (ఎంబీఎస్) ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. కాలు ఫ్రాక్చర్ అయిన విద్యార్థి మరో 14 మందితో కలిసి మంటల నుంచి తప్పించుకునేందుకు భవనం మొదటి అంతస్తు నుంచి దూకినట్లు వారు తెలిపారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధం రావడంతో నిద్రలేచి తన గది నుంచి బయటకు వచ్చేసరికి ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. మెట్ల నిండా పొగలు కమ్ముకోవడం, భవనం నుంచి బయటకు వేరే మార్గం లేకపోవడంతో విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

ఈ భవనంలో 75 గదులు ఉండగా అందులో 61 గదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడంతో, కొంతమంది విద్యార్థులు భవనం పైకప్పుపైకి ఎక్కారు. మరికొందరు గోడలు, కిటికీల ద్వారా క్రిందికి దిగడానికి ప్రయత్నించారు. మరికొందరు మొదటి అంతస్తు నుంచి దూకడంతో కాళ్లకు గాయాలు అయ్యాయని వారు తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయని ఎస్పీ దుహాన్ తెలిపారు. మంటలు పై అంతస్తులకు వ్యాపించకముందే అదుపు చేశారు. విద్యార్థులందరినీ భవనం నుంచి రక్షించినట్లు కున్హారి పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపారు. కోట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించనందుకు హాస్టల్‌ను సీలు చేసినట్లు అగ్నిమాపక అధికారి వ్యాస్ తెలిపారు.

Exit mobile version