BCCI Meeting on IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ఈ ఏడాది చివరలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. నేడు ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటైన్షన్, జట్టు పర్స్ వాల్యూ పెంపుపై దృష్టిసారించాలని కోరుతున్నాయట.
మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని (పర్స్ వాల్యూ) రూ.120 కోట్లకు పెంచాలని గవర్నింగ్ బాడీని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి జట్టుకు రూ.100 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. ఇక కనీసం ఆరుగురిని రిటైన్ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయట. ఐపీఎల్ టాప్ జట్టు ఒకటి ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకొనే అవకాశం ఉంది.
Also Read: 5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్!
‘పర్స్ వాల్యూ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కూడా సానుకూలంగా ఉంది. పర్స్ విలువ తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. 20-25 శాతం పెంపు ఉండొచ్చు. అతిపెద్ద సమస్య మాత్రం ఆటగాళ్ల రిటెన్షన్. రైట్ టు మ్యాచ్‌తో కలిపి రిటెన్షన్‌లో 8 మందికి అవకాశం ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు కోరుతున్నాయి. బీసీసీఐ 6 మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అందులో ఉండాలి. ఓవర్సీస్ ప్లేయర్ల రిటైన్ విషయంలోనూ చర్చ జరగనుంది. ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఒకరి కంటే ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.