Ratnamala Movie: తెలుగు చలనచిత్ర సీమలో ‘భరణీ పిక్చర్స్’ సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహానటి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ ఈ సంస్థను నెలకొల్పారు. బహుముఖ ప్రతిభాపాటవాలకే కాకుండా, సాహసానికీ మారుపేరుగా నిలిచారు భానుమతి. నటిగా తాను చిత్రసీమలో అడుగుపెట్టిన రోజుల్లో కొన్ని చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన పి.రామకృష్ణను భానుమతి ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. తన భర్తను దర్శకనిర్మాతగా చూడాలన్న అభిలాషతోనే భానుమతి ‘భరణీ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పారు. వారి ప్రప్రథమ ప్రయత్నంగా ‘రత్నమాల’ చిత్రాన్ని తెరకెక్కించారు. 1948 జనవరి 2న విడుదలైన ‘రత్నమాల’లోని కథ, కథనం వైవిధ్యంగా ఉంటాయి. ఇందులో పదహారేళ్ళ అమ్మాయిని, పదహారు నెలల అబ్బాయి పెళ్ళిచేసుకోవడం విశేషం!
ఇంతకూ ‘రత్నమాల’ కథ ఏమిటంటే – కాంచీపురం రాజు సింహకేతు తన పదహారేళ్ళ కూతురు రత్నమాలకు సరైన వరుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఆయన పొరుగు రాజయిన చంద్రచూడునికి ఓ మగపిల్లవాడు జన్మించి ఉంటాడు. అతని పేరు చంద్రకాంత్. అతని జాతక రీత్యా పదహారు మాసాల ప్రాయంలో పదహారేళ్ళ కన్యతో చంద్రకాంత్ కు వివాహం జరిగితేనే అతని జీవితం ముందుకు సాగుతుందని తెలుస్తుంది. దాంతో చంద్రచూడుడు తన మంత్రిని తగిన అమ్మాయిని వెదకమని పురమాయిస్తాడు. ఆ ప్రయత్నంలో చంద్రచూడుని మంత్రి కాంచీపురం చేరుకొని, అక్కడ రత్నమాల కోసం వరుడి అన్వేషణ సాగుతోందని తెలుసుకుంటాడు. రాజు కొడుకు జీవితం కోసం, తన సొంత కొడుకు చిత్రపటం చూపించి, రత్నమాలను తమ రాజకుమారునికి ఇచ్చి వివాహం జరిపించమని సింహకేతును కోరతాడు. రత్నమాల కూడా ఆ చిత్రపటం చూసి, పెళ్ళికి అంగీకరిస్తుంది. తమ సంవ్రదాయం ప్రకారం ‘కత్తితో వివాహం’ జరిపించాలని సూచిస్తాడు మంత్రి. అందుకు రత్నమాల సైతం సరేనంటుంది. అలా రత్నమాలకు ఖడ్గ వివాహం జరిగిన తరువాత కాపురానికి వెళ్ళగా, అక్కడ గదిలో యువకుని బదులుగా పదహారు నెలల బాలుడు ఉండడం చూసి కంగు తింటుంది. అప్పుడు ఆమెకు అందరూ నిజం చెబుతారు. రత్నమాల తనను మోసం చేసిన వారి వద్ద ఉండరాదని భావించి, తన భర్త అయిన ఆ బాబును తీసుకొని వెళ్తుంది. అడవిలో ఆమెకు వృద్ధదంపతుల ఆశ్రయం లభిస్తుంది. తన కూతురు కనిపించడం లేదన్న విషయం సింహకేతుకు తెలుస్తుంది. దాంతో చంద్రచూడుని, అతని మంత్రిని, అతని కొడుకును బందీచేస్తాడు. కాలం గడుస్తుంది. అప్పటికి ఏడేళ్ళ బాలుడైన చంద్రకాంత్ ను ఓ రోజు ఓ ముఠా ఎత్తుకు వెళ్తుంది. అతనిని వెదుక్కుంటూ రత్నమాల బయలు దేరుతుంది. ఆ సమయంలో ఆమె పినతండ్రి ధూమకేతు, రత్నమాలను చూసి కాంచీపురం తీసుకువెళతాడు. అక్కడ ఆమె తండ్రి, నీ భర్త ఏడని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సమాధానం చెప్పలేదు. ఎంత అడిగినా జవాబు చెప్పని కూతురును సైతం ఉరి తీయాలని భావిస్తాడు సింహకేతు. అప్పుడు చంద్రచూడుని మంత్రి కొడుకు అసలు విషయం చెబుతాడు. సింహకేతు మరింత అగ్గిమీద గుగ్గిలమై అందరినీ శిక్షించాలని భావిస్తాడు. అయితే చంద్రకాంత్ నవయువకునిగా మారి, అక్కడకు వచ్చిచేరతాడు. అంతకాలం వారికి ఆశ్రయమిచ్చిన వృద్ధదంపతులు శివపార్వతులే అన్న విషయం తెలుస్తుంది. వారి కృపతోనే చంద్రకాంత్ నవయువకునిగా మారాడన్న వాస్తవం బోధపడుతుంది. రత్నమాలకు అలా ఎందుకు జరిగిందో వివరంగా తెలుస్తుంది. దాంతో అందరూ ఆనందిస్తారు. రత్నమాల, చంద్రకాంత్ వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
Dimple Hayathi : మతులు పోగొడుతున్న డింపుల్ హయతి..
రత్నమాలగా భానుమతి, చంద్రకాంత్ గా అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రంలో సీయస్సార్ ఆంజనేయులు, గోవిందరాజుల సుబ్బారావు, సూర్యనారాయణ, ఆరణి సత్యనారాయణ, న్యాపతి రాఘవరావు, సీతారామ్, హేమలత, బేబీ సుమిత్ర ఇతర ముఖ్యపాత్రధారులు.
ఈ చిత్రానికి సి.ఆర్.సుబ్బురామన్ సంగీతం సమకూర్చగా, సీనియర్ సముద్రాల పాటలు, మాటలు పలికించారు. ఇందులోని “ఆనంద దాయినీ భవానీ…”, “ఆగవే మరదలా…”, “వగలాడి నిను చేరురా…”, “ఓరందగాడా…”, “పోయిరా… మా తల్లి…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో భానుమతి తన నటనతోనే కాదు, నర్తనంతోనూ మురిపించారు. తరువాతి రోజుల్లో మేటి దర్శకుడు అనిపించుకున్న వేదాంతం రాఘవయ్య ఈ సినిమాకు నృత్యం సమకూర్చడం విశేషం! ‘దేవదాసు’లాగే ఈ చిత్రానికీ కొన్ని పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి రాశారని, అయినా సినిమాలో సీనియర్ సముద్రాల ఒక్కరి పేరే వేశారని అంటారు. ఈ సినిమా అప్పట్లో కొన్ని విమర్శలకు గురయింది. అయినా జనం ఆదరించారు. ఈ చిత్రం విడుదలైన సరిగా 55 రోజులకు ఏయన్నార్, యస్.వరలక్ష్మి నటించిన ‘బాలరాజు’ జనం ముందు నిలచింది. ఆ సినిమాకు విశేషాదరణ లభించడంతో ‘రత్నమాల’ను తరువాతి రోజుల్లో ఎవరూ అంతగా గుర్తుపెట్టుకోలేదు.
పాత కథలను కొత్తగా తయారు చేసి చిత్రాలు రూపొందించడంలో భళా అనిపించిన ఎస్.జె.సూర్య ఇందులోని కథాంశంతోనే మహేశ్ బాబుతో ‘నాని’ అనే సినిమాను సోషల్ మూవీగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ‘రత్నమాల’ జానపద చిత్రం కాబట్టి, దైవానుగ్రహంతో బాలుడు కాస్త నవయువకునిగా మారతాడు. దానినే సూర్య తన తెలివితేటలతో ప్రయోగాలు చేసి, ఓ బాలుణ్ణి యువకునిగా మార్చినట్టు ‘నాని’లో చూపించారు.