Odisha Old Man walks 600 KM from Hyderabad: ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా పట్టుపని పది కిలోమీటర్లు నడవలేరు. అంతెందుకు 250-500 మీటర్ల దూరంలో ఉన్న షాప్ వెళ్లేందుకు కూడా బైక్ తీసుకెళుతుంటారు. అలాంటిది ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్నాడు. వెళ్లిన చోట పని దొరక్కపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఆ వృద్ధుడు కాలి నడకన ప్రయాణించాడు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని నవరంగపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
నవరంగపూర్ జిల్లా కొసగుముడా సమితి డుమరబెడ గ్రామానికి చెందిన 65 ఏళ్ల సోను బొత్రకు కొడుకు, కుటుంబం ఉంది. అయినా కూడా తాను ఏదైనా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దళారి సాయంతో 17 రోజుల క్రితం కూలి పనుల కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ ఇటుక బట్టీ యజమాని బొత్రను చూసి.. వయసు ఎక్కువగా ఉందని, పనిలో పెట్టుకోలేనని చెప్పాడు. ఎంత బ్రతిమిలాడినా అతడు ఒప్పుకోలేదు. చివరకు రూ.200 ఇచ్చి ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు.
Also Read: Kerala News: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి! శిథిలాల కింద వందలాది మంది
పని దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సోను బొత్ర.. 14 రోజుల క్రితం స్వగ్రామం డుమరబెడకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో కాలి నడకన బయలుదేరాడు. దారిలో ఎవరైనా భోజనం పెడితే తింటూ.. అలసిపోయిన చోట విశ్రాంతి తీసుకుంటూ 600 కిలోమీటర్లు నడిచాడు. చివరకు సోను బొత్ర సోమవారం మాలిగూడ చేరుకున్నాడు. అక్కడ చాలా నీరసించిన బొత్రను చూసిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి ఆటోలో తీసుకెళ్లారు. పని ఇప్పిస్తామని తీసుకెళ్లి మోసం చేసిన దళారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.