NTV Telugu Site icon

World Cup 2023: తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్న 6 భారత ఆటగాళ్లు.. లిస్టులో హైదరాబాద్ ప్లేయర్! తుది జట్టులో చోటెవరికంటే

India Team Ground

India Team Ground

Six Players Will Play ODI World Cup for the First Time: సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి ఆరుగురు ఆటగాళ్లు తొలిసారిగా భారత్ తరపున వన్డే ప్రపంచకప్ ఆడనున్నారు.

శుభ్‌మన్ గిల్:
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలిసారి ప్రపంచకప్‌ ఆడనున్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండడంతో గిల్ జట్టులోకి వచ్చాడు. గత ఏడాది కాలంగా అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ జతగా గిల్ బరిలోకి దిగుతాడు. గత దశాబ్దంలో ఐసీసీ టోర్నీలలో అద్భుతంగా రాణించిన ధావన్‌ను గిల్ భర్తీ చేస్తాడేమో చూడాలి.

శ్రేయాస్ అయ్యర్:
స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. గత కొంత కాలంగా కీలక నాలుగో స్థానంలో అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడం అతడి బలం. అంతేకాదు అవసరం అయితే డిఫెన్స్ ఆడుతాడు, హిట్టింగ్ చేయగలడు. అయితే గాయం కారణంగా ఇటీవల ఎక్కువగా ఆడని శ్రేయాస్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. నాలుగో స్థానంలో అయ్యర్ బరిలోకి దిగడం ఖాయం.

మహ్మద్ సిరాజ్:
హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ భారత్ తరపున తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. సిరాజ్ గత ఏడాది కాలంగా భారత జట్టుకు కీలకంగా మారాడు. సీనియర్లు మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ దళంకు నాయకత్వం వహించాడు. కొత్త బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. సిరాజ్ తుది జట్టులో ఉంటాడు.

శార్దూల్ ఠాకూర్:
ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. ముంబైకి చెందిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ హిట్టింగ్ కూడా చేయగలడు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడదీయగలడు. అంతేకాదు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అయితే శార్దూల్ ఇటీవలి కాలంలో పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఆల్‌రౌండర్‌లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటారు కాబట్టి.. మనోడికి చోటు కష్టమే.

Also Read: Asia Cup 2023: సూపర్‌-4 వేదికల్లో మార్పు లేదు.. సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్!

ఇషాన్ కిషన్:
యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ భారత్ తరఫున తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టులో అవకాశం వచ్చినా.. తానేంటో నిరూపించుకున్నాడు. ఆసియా కప్ 2023లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకర్షించాడు. అయిదు ఇషాన్ తుది జట్టులో ఉండడం అనుమానమే. ఎందుకంటే కేఎల్ రాహుల్ అతడికి పోటీదారుగా ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్:
ఐపీఎల్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ మొదటిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. టీ20ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లే సూర్యకు జట్టులో చోటి కల్పించింది. అయితే వన్డే ఫార్మాట్‌లో అతని ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో పోటీ ఎక్కువగా ఉండడంతో సూర్యకు తుది జట్టులో చోటు కష్టమే.