TNPL 2023, Nellai Royal Kings Batters Hits 5 sixes in Single Over: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసంను ఇప్పటికీ ఎవరూ మరిచిపోయి ఉండరు. ఎందుకంటే కచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. రింకూ లాంటి ఇన్నింగ్స్ తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ ( టీఎన్‌పీఎల్) 2023లో వచ్చింది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు వచ్చాయి. అయితే రింకూ సింగ్ మాదిరి ఒకరే ఇక్కడ సిక్సర్లు బాధలేదు.
టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా సోమవారం జరిగిన క్వాలిఫయర్ 2లో నెల్లయ్ రాయల్ కింగ్స్, దిండిగుల్ డ్రాగన్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ 185 పరుగులు చేసింది. శివమ్ సింగ్ 46 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 76 రన్స్ చేశాడు.186 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దాంతో ఓటమి దిశగా నెల్లయ్ కింగ్స్ నడించింది. 21 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉండగా రితిక్ ఈశ్వరన్ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు అజితేష్ గురుస్వామి ఉన్నాడు. ఇక చివరి రెండు ఓవర్లలో 37 పరుగులు అవసరం అయ్యాయి.
Also Read: Cock in Lockup: రెండు రోజులుగా లాకప్‌లో కోడిపుంజు.. ఏం నేరం చేసిందో తెలుసా?
అప్పటివరకు జి కిషూర్ 2 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఊపుమీదున్నాడు. అయితే 19వ ఓవర్ వేసిన కిషూర్‌కు రితిక్ ఈశ్వరన్ చుక్కలు చూపించాడు. మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది.. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఐదో బంతికి అజితేష్ గురుస్వామి సిక్సర్ బాదాడు. అప్పటికే నిరాశకు గురైన కిషూర్ చివరి బంతిని నో-బాల్‌గా వేశాడు. ఆ బంతికి ఓ రన్ వచ్చింది. ఇక చివరి బంతికి రితిక్ మరో సిక్సర్ బాదాడు. 5 సిక్సులు, ఓ నోబాల్, సింగిల్ రన్‌తో మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి.
ఇక నెల్లయ్ రాయల్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 4 పరుగులు అవసరం అయ్యాయి. రితిక్ ఈశ్వరన్ మరో సిక్స్ బాది రాయల్ కింగ్స్‌కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. అజితేష్ గురుస్వామి 44 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్ చేసాడు. రితిక్ ఈశ్వరన్ 11 బాల్స్‌లో ఆరు సిక్సర్లతో 39 పరుగులు బాదాడు. రితిక్, అజితేష్ బాదిన సిక్సులకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: America Richest Women List 2023: ఫోర్బ్స్ అమెరికా మహిళా సంపన్నుల జాబితా.. నలుగురు భారతీయులకు చోటు!