Site icon NTV Telugu

Cabinet: రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

Union Cabinet

Union Cabinet

Union Cabinet: పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2024-2025 రబీ సీజన్‌కు గానూ గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్‌, శనగ, ఆవాలు, కందులు ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. గోధుమల కనీస మద్దతు ధరను రూ.150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు చేరుకుంది. అలాగే బార్లీపై రూ.115 పెంచి రూ.1850; శెనగపై రూ.105 పెంచి రూ.5440; కందులుపై రూ.425 పెంచి రూ.6425; ఆవాలుపై రూ.200 పెంచి రూ.5650; సన్‌ఫ్లవర్‌పై రూ.150 పెంచి రూ.5,800గా కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు.

Also Read: Supreme Court Collegium: 13 మంది న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు

పండుగకు ముందే ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. అక్టోబరు 18 నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఆమోదం లభించింది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు.. పెన్షనర్లకు ఇవ్వవచ్చు. నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 24న దసరా, నవంబర్ 12న దీపావళి. ఈ పండుగల కల్లా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందుతారు. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయింది.

రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే బోనస్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని మినహాయించి ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లతో పాటు అర్హులైన 11 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం రూ.1968.87 కోట్లు వెచ్చించనున్నారు.

Exit mobile version