NTV Telugu Site icon

Mumbai: థానే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

De

De

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.

ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం మధ్యాహ్నం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అనేక మంది కార్మికులు చిక్కుకుపోయారు. MIDC ఫేజ్ 2లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ భారీ పేలుడికి నలుగురు మృతి చెందగా,   25 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీలో మూడు పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కనీసం ఎనిమిది మందిని రక్షించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు.

డోంబివిలి ఎంఐడీసీలోని అముదన్ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలిన ఘటన బాధాకరమని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు .ఈ ఘటనలో 8 మందిని రక్షించారని.. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరిన్ని అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని.. దీనిపై కలెక్టర్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు. NDRF, TDRF. అగ్నిమాపక దళం 10 నిమిషాల్లోనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు దాదాపు 15 ఫైర్ ఇంజన్లు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. కార్ షోరూమ్ సహా మరో రెండు భవనాలకు మంటలు వ్యాపించాయి.