Site icon NTV Telugu

Suicide Blast: పోలీసు ట్రక్కు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి, 27 మందికి గాయాలు

Suicide Blast

Suicide Blast

Suicide Blast: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి పేలుడులో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. పేలుడులో గాయపడిన మహిళ మరణించింది. 23 మంది పోలీసులతో సహా 27 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు మృతుల సంఖ్యకు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు. ఇదిలావుండగా గాయపడిన వారిలో ఎక్కువ మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి యంత్రాంగం తెలిపింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని.. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి బాంబర్ అవశేషాలు లభించాయని క్వెట్టా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గులాం అజ్ఫర్ మహేసర్ వెల్లడించారు. పేలుడు ధాటికి పోలీసు ట్రక్కు బోల్తాపడి లోయలో పడిందని తెలిపారు.

AAP’s Candidate video viral: తుపాకీ చూపిస్తూ ఆప్‌ నేత హల్‌చల్‌.. వీడియో వైరల్

పోలీసు ట్రక్కును లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగినట్లు ప్రాథమిక ప్రకటనలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. గాయపడిన పోలీసులు, పౌరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు జియో న్యూస్ నివేదించింది.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయాన్ని కూడా కోరారు. లోయలో పడిపోవడంతో ట్రక్కు కింద నలిగిపోవడం వల్లే పోలీసు మరణించాడని డీఐజీ మెహసర్ చెప్పారు. దాదాపు 20 మంది పోలీసులు, నలుగురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పేలుడులో పోలీసు ట్రక్కుతో సహా మూడు వాహనాలు, సమీపంలోని రెండు కార్లు దెబ్బతిన్నాయని డీఐజీ తెలిపారు. దాడిలో దాదాపు 20-25 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, దాడిని ఖండిస్తూ, బలూచిస్థాన్ ప్రభుత్వం నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వేర్వేరు ప్రకటనల్లో ఉగ్రవాద దాడిని ఖండించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంపై తక్షణ విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సహాయం అందించడానికి ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version