NTV Telugu Site icon

Mine Blast in Turkey: టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు.. 25 మంది దుర్మరణం

Mine Blast

Mine Blast

Mine Blast in Turkey: ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి 25 మంది మృతి చెందారు. చాలా మంది భూగర్భంలో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గడిచిన 11 ఏళ్లలో టర్కీలో జరిగిన అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదాలలో ఇది ఒకటని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్‌ కోకా వెల్లడించారు. సజీవంగా బయటకు తీసిన మరో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ట్వీట్ చేశారు. తాము విచారకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లు అన్నారు.

మొత్తం 110 మంది భూగర్భంలో పనిచేస్తున్నారని, వారిలో కొందరు తమంతట తాముగా బయటకు రాగా.. మరికొందరిని అధికారులు రక్షించారని మంత్రి సోయ్లు తెలిపారు. దాదాపు 50 మంది మైనర్లు 2 వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని అంతర్గత మంత్రి తెలిపారు.వారు భూగర్భంలో 300, 350 మీటర్ల మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని సోయ్లీ ముందస్తు నివేదికలను ధ్రువీకరించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటానని చెప్పారు. ప్రాణనష్టం పెరగకూడదని, మైనర్లు సజీవంగా దొరుకుతారని తాము ఆశిస్తున్నామని ఎర్డోగాన్ పేర్కొన్నారు.

Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?

సూర్యాస్తమయానికి కొద్ది క్షణాల ముందు పేలుడు సంభవించింది. చీకటి కారణంగా రెస్క్యూ ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. టర్కీకి చెందిన మాడెన్ ఈజ్ మైనింగ్ వర్కర్స్ యూనియన్ పేలుడుకు మీథేన్ గ్యాస్ ఏర్పడటమే కారణమని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు రావడం అకాలమని ఇతర అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి సహాయకులతో పాటు బలగాలు అక్కడ చర్యలు చేపట్టాయి. 70 మందికి పైగా రక్షకుల బృందం 250 మీటర్ల దిగువన ఉన్న గొయ్యిలో ఒక ప్రదేశానికి చేరుకోగలిగిందని స్థానిక గవర్నర్ చెప్పారు. స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ సంఘటనను ప్రమాదంగా పరిగణిస్తున్నట్లు, అధికారిక దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 2014లో టర్కీలోని పశ్చిమ పట్టణమైన సోమాలో జరిగిన పేలుడులో 301 మంది కార్మికులు మరణించారు.