Chittoor Road Accident Today: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పింది. అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మానియంబాడికి చెందిన కుబేంద్రన్ (35)కు తీవ్రంగా గాయాలయ్యాయి.
Also Read: Kartik Tyagi Bowling: 153 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతి.. నొప్పితో విలవిల్లాడిన పీయూష్ చావ్లా!
సమాచారం అందుకున్న గుడిపాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను గుడిపాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.