Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం ఉంటుందా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రపంచంలో రాజులు, రాణులు ఇప్పటికీ పలు దేశాలలో పాలిస్తున్నారు. ఇది నిజమే.. కొన్ని దేశాలలో ఈ రాచరికం పూర్తి అధికారంతో ఉంటే, మరి కొన్ని దేశాల్లో కేవలం సింబాలిక్‌గా ఉంది. అదే సమయంలో కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యం, రాచరికం రెండు ఉన్నాయి. అలాంటి దేశాల్లో రాజు పాత్ర పరిమితంగా ఉంటుంది. ఇంతకీ ఏయే దేశాల్లో ఈ 21 శతాబ్దంలో రాచరిక వ్యవస్థలు ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Tomato Prices Fall: భారీగా పడిపోయిన టమోటా రేటు.. రైతన్నకు తీవ్ర నష్టం..
జపాన్‌లో చక్రవర్తికి రాజకీయ అధికారం లేకపోయినా, అక్కడ ఈ పదవి అత్యంత గౌరవనీయమైన సాంస్కృతిక చిహ్నంగా పరిగణిస్తున్నారు. రాచరికం ఉన్న దేశాలలో సంప్రదాయాలు, రాజభవనాలు, రాజ కుటుంబాలు, పట్టాభిషేక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిజం ఏమిటంటే ఎన్నికలు, పార్లమెంటులు ప్రపంచాన్ని పాలిస్తున్నప్పటికీ, రాచరికం వెలుగు, ప్రత్యేకమైన ఆకర్షణ ఇప్పటికీ లక్షలాది మంది హృదయాలను ఆకర్షిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశానికి కూడా రాచరికంతో లోతైన సంబంధం ఉంది. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో వందలాది రాచరిక సంస్థానాలు ఉండేవి. రాజులు, నవాబులు, మహారాజులు పరిపాలించేవారు. జైపూర్, జోధ్‌పూర్, మైసూర్, గ్వాలియర్ వంటి రాచరిక రాష్ట్రాల రాజ కుటుంబాలు ఇప్పటికీ వారి వారసత్వం, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందాయి. 1947 తర్వాత భారతదేశం గణతంత్రాన్ని స్వీకరించింది. దీనితో పాటు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు రాజులు, నవాబులు క్రమంగా రాజకీయ అధికారం నుంచి వేరు అయ్యారు.
ఇప్పటికీ రాచరికం ఉన్న 5 దేశాలు..
1. బ్రూనై: బ్రూనై ఆగ్నేయాసియాలో ఒక చిన్న దేశం. కానీ చాలా సంపన్న దేశం. ఈ దేశం సుల్తాన్ హస్సనల్ బోల్కియా ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తులలో ఒకరు. బ్రూనైలోని వ్యవస్థ పూర్తిగా నిరంకుశమైనది. సుల్తాన్ కింద కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ పనిచేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక రాజ కుటుంబాలలో బ్రూనై సుల్తాన్ పేరు ఒకటి.
2. ఎస్వతిని: ఎస్వతిని గతంలో స్వాజిలాండ్ అని పిలిచే వారు. ఇప్పుడు దీనిని ఈశ్వతిని అని పిలుస్తున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్న రాజు అమ్శ్వతి III. ఆయనకు దేశంలో సంపూర్ణ అధికారం ఉంది. ఆయన తలుచుకుంటే పార్లమెంటును రద్దు చేయగలడు, మంత్రివర్గాన్ని నియమించగలడు, న్యాయవ్యవస్థలో కూడా జోక్యం చేసుకోగలడు. ఈ చిన్న ఆఫ్రికన్ దేశంలో ప్రజాస్వామ్యం జాడ స్వల్పంగా ఉన్న.. కానీ నిజమైన అధికారం రాజు చేతుల్లో కేంద్రీకృతమై ఉంది.
3. డెన్మార్క్: ఐరోపాలోని స్కాండినేవియన్ దేశాలలో రాచరికం ఇప్పటికీ సంప్రదాయం, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా ఉంది. డెన్మార్క్ రాణి మార్గరెత్ II జనవరి 2024లో సింహాసనాన్ని వదులుకోవడం ద్వారా చారిత్రాత్మక అడుగు వేసింది. తరువాత ఆమె కుమారుడు ఫ్రెడరిక్ X కొత్త రాజు అయ్యాడు. డెన్మార్క్‌లో రాజు, రాణికి ఎటువంటి రాజకీయ అధికారం లేదు. కానీ వారు జాతీయ ఐక్యత, సంప్రదాయానికి చిహ్నంగా ఉన్నారు.
4. భూటాన్: భారతదేశ పొరుగు దేశం.. హిమాలయాల దేశం భూటాన్. ఈ దేశం కూడా ఒక రాచరిక దేశం. దీని రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్. ఆయన చాలా ప్రజాదరణ పొందిన రాజు. ఇది రాజ్యాంగబద్ధమైన రాచరికం, కానీ రాజు అభివృద్ధి విధానాలు ‘స్థూల జాతీయ ఆనందం’ వంటి ప్రత్యేకమైన ఆలోచనల ద్వారా దేశ దిశను నిర్ణయించడంలో చురుకైన పాత్ర పోషిస్తాడు. భూటాన్ ప్రజలు తమ రాజును ‘డ్రాగన్ కింగ్’ అని పిలుస్తారు.
5. జపాన్: జపనీస్ ఇంపీరియల్ ఫ్యామిలీని ప్రపంచంలోనే అత్యంత పురాతన రాజకుటుంబంగా పరిగణిస్తారు. ప్రస్తుత చక్రవర్తి నరుహిటో స్థానం పూర్తిగా ప్రతీకాత్మకమైనది. అతనికి రాజకీయ అధికారం లేదు. కానీ అతను జపాన్ సంప్రదాయం, సంస్కృతికి ముఖ్యమైన చిహ్నం. జపనీస్ ప్రజలు చక్రవర్తిని “జాతీయ ఐక్యతకు” చిహ్నంగా భావిస్తారు.
READ ALSO: Robot Pregnancy: ఇనుములో హృదయం..! కట్ చేస్తే.. షాకింగ్ ట్విస్ట్