Pakistan: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ముల్తాన్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్‌లోని నిస్తార్ ఆస్పత్రిలో సుమారు 200 మృతదేహాలు మార్చురీ పైకప్పుపై కుళ్లిన స్థితిలో బయటపడడం కలవరం రేపింది. ఆ మృతదేహాలన్ని గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయాయి. కొన్ని శవాలను ఛాతులను చీల్చి అవయవాలను తీసి ఆసుపత్రి పైకప్పుపై పడేశారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ఆ మార్చురీకి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించారు. ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన ఆయనకు మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే మార్చురీ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి చలించిపోయారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వ్యక్తి తనకు ఫిర్యాదు చేయగానే.. తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది తనను మార్చురీలోకి వెళ్లడానికి అంగీకరించలేదని తెలిపారు. కోపంతో తలుపులు తెరవకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించడంతో తలుపులు తెరిచినట్లు ఆయన వివరించారు. అక్కడి దృశ్యం తనను తీవ్రంగా కలిచివేసిందని, షాక్‌కు గురిచేసిందని తారిక్ జమాన్ గుజ్జార్ అన్నారు. మార్చురీని తెరిచినప్పుడు ఆ గదిలో దాదాపు 200 మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయని.. కుళ్లిపోతున్న స్త్రీ, పురుష మృతదేహాలు నగ్నంగా ఉన్నాయన్నారు. కనీసం స్త్రీల మృతదేహాలను కూడా కప్పలేదనన్నారు. షాక్ అయిన ఆయన.. ఇదేంటి అని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే. అవన్నీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం వాడుతున్నారని చెప్పారని గుజ్జార్ చెప్పారు.
ఈ మృతదేహాలను విక్రయిస్తారా అని మార్చురీ అధికారులను ప్రశ్నించినట్లు గుజ్జార్ తెలిపారు. అలాగే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలను తాను వైద్యులను కోరాననన్నారు. శవాలు పడి ఉన్న తీరు చూస్తుంటే విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లుగా కనిపించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ మృతదేహాలపై పిచ్చి మొక్కలు మొలిచాయని గుజ్జార్ చెప్పారు. తన 50 ఏళ్ల జీవితంలో ఇలాంటివి చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కూడా బట్టలులేవు. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మెడికల్ స్టూడెంట్స్ ఆ మృతదేహాలను వాడిన తర్వాత సరైన రీతిలో డీకంపోజ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిస్తార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతదేహాలను వదిలేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.
Loan App Crime: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. విచారణలో షాకింగ్ నిజాలు
ముల్తాన్‌లో నిస్తార్ ఆసుపత్రి మార్చురీ కప్పుపై మృతదేహాలు ఉన్నాయన్న వార్త పాకిస్తాన్‌లో కలకలం రేపింది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చౌదరి జమాన్ గుజ్జర్ సలహాదారు వెలుగులోకి తెవడంతో ఆసుపత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై నిస్తార్ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధి సజ్జాద్ మసూద్ ఓ ప్రకటన విడుదల చేశారు. మృతదేహాలు కుళ్లిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మార్చురీ పైకప్పుపై డజన్ల కొద్ది మృతదేహాలు లేవని, కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే ఉన్నాయని, వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం వాడే ముందు వాటిని సహజంగా డ్రైగా అయ్యేందుకు అలా వదిలేశారని పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పంజాబ్ సౌత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సాకిబ్ జాఫర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, మృతదేహాలను అపవిత్రం చేయడం, వదిలివేయడంపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.