Site icon NTV Telugu

Odisha: వడదెబ్బతో 3 రోజుల్లో 20 మంది మృతి

Heat Stroke

Heat Stroke

Odisha: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. శుక్రవారం నుంచి వివిధ జిల్లాల్లో మొత్తం 99 మంది వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. పోస్ట్‌మార్టం, విచారణ తర్వాత 20 మంది వడదెబ్బ మరణాలుగా నిర్ధారించారు. అయితే రెండు మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించాయని పేర్కొంది. మిగిలిన కేసుల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. దీనికి ముందు 42 అనుమానాస్పద వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులు నిర్ధారించబడ్డాయి. మరో ఆరు మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించినట్లు ఆ ప్రకటన ద్వారా తెలిసింది. బోలంగీర్, సంబల్‌పూర్, జార్సుగూడ, కియోంజర్, సోనేపూర్, సుందర్‌గఢ్, బాలాసోర్ జిల్లాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Read Also: AP Election Results: బెట్టింగ్ బాబులకు ఎగ్జిట్ పోల్స్ టెన్షన్..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా, ప్రత్యేక సహాయ కమిషనర్ సత్యబ్రత సాహు ఆదివారం జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. వేడిగాలులపై సూచనలను అమలు చేయాలని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.ప్రతి అనుమానాస్పద వడదెబ్బ మృతులకు కూడా పోస్టుమార్టం నిర్వహించి పరిహారం మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగాలను కోరారు. అలాగే, ప్రతి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి స్థానిక రెవెన్యూ అధికారి, స్థానిక వైద్యాధికారి సంయుక్త విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.

Exit mobile version