NTV Telugu Site icon

Madhya Pradesh: ఫలించని శ్రమ.. 300 అడుగుల లోతు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి

Madhyapradesh

Madhyapradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల తర్వాత 300 అడుగుల బోరుబావిలోంచి బయటకు తీసిన రెండేళ్ల బాలిక గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాజధాని భోపాల్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని సెహోర్‌లో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం కోసం తరలించిన చిన్నారి మృతదేహం బాగా కుళ్లిపోయిందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముంగవలి గ్రామంలోని సృష్టి అనే బాలిక బోరుబావిలో పడింది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఆమెను బయటకు తీసి, చికిత్స కోసం అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు మరో అధికారి తెలిపారు.

ఆమె మొదట బోర్‌వెల్‌లో దాదాపు 40 అడుగుల లోతులో కూరుకుపోయిందని, అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన యంత్రాల వల్ల కలిగే ప్రకంపనల కారణంగా ఆమె దాదాపు 100 అడుగుల లోతుకు జారిపోయిందని, దీంతో పని మరింత కష్టతరంగా మారిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ (SDERF)తో పాటు, సైన్యం, రోబోటిక్ నిపుణుల బృందం కూడా రెస్క్యూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.

Read Also: Bihar: వంతెన స్లాబ్‌, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

అసలేం జరిగిందంటే.. రెండేళ్ల చిన్నారి మంగళవారం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. దీంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 50 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. ఆ బాలికను బయటకు తీసి చికిత్స కోసం పంపించినా ఫలితం లేకపోయింది. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.