NTV Telugu Site icon

Spying: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఇద్దరి అరెస్ట్..

Up Ats

Up Ats

Spying: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు టెర్రర్ ఫైనాన్సింగ్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమృత్ గిల్ అలియాస్ అమృత్ పాల్ (25), ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న రియాజుద్దీన్ (36)లను ATS అరెస్టు చేసింది.

ఏటీఎస్ టీమ్ నవంబర్ 23న బటిండా నుంచి అమృత్ గిల్ ను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై ఉత్తర్ ప్రదేశ్‌కి తీసుకువచ్చారు. రియాజుద్దీన్‌ని విచారణ కోసం పిలిచి అక్కడే అరెస్ట్ చేశారు. అనుమానాస్పద ఖాతాల నుంచి కొంత మంది డబ్బులు తీసుకుంటున్నారని, వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు, గూఢచర్యానికి వినియోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఏటీఎస్ పేర్కొంది. వీరిద్దరు డబ్బు కోసం ఐఎస్ఐకి సున్నితమైన రహస్య సమాచారాన్ని పంపుతున్నారని ఏటీఎస్ ఆరోపించింది. విచారణ అనంతరం రియాజుద్దీన్, ఇజారుల్ హక్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హక్ బీహార్ జైలులో ఉన్నాడు. అతన్ని రిమాండ్‌పై అధికారులు లక్నోకి తీసుకురానున్నారు.

Read Also: Revanth Reddy: పటాన్‌చెరులో పదేళ్లుగా బీఆర్ఎస్ రౌడీయిజం నడుస్తోంది..

సాక్ష్యాధారాలు సేకరించిన సమయంలో, రియాజుద్దీన్ బ్యాంక్ ఖాతాలో మార్చి 2022 నుంచి ఏప్రిల్ 2022 మధ్య రూ. 70 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేల్చారు. ఆ తర్వాత వీటిని వేర్వేరు ఖాతాలకు మార్చారు. ఈ క్రమంలోనే ఐఎస్ఐకి సమాచారం అందించిన ఆటోడ్రైవర్ అమృ‌త్ గిల్‌కి డబ్బులు పంపాడు. అమృత్ గిల్ భారత సైన్యానికి సంబంధించిన ట్యాంకులు, మొదలైన సమాచారాన్ని పంచుకున్నాడు.

రియాజుద్దీన్, హక్ రాజస్థాన్‌లో వెల్డింగ్ పని చేస్తున్నప్పుడు కలుసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు టచ్‌లో ఉంటూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్నారు. గిల్‌కి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని, భారత సైన్యానికి సంబంధించిన సున్నిత, నియంత్రిత సమాచారాన్ని పంపేవాడని తేలింది.