తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జైలు నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు విక్టరీ సాధించారు. దీంతో దేశ వ్యాప్తంగా వీరిద్దరి గురించి చర్చ జరుగుతోంది. వీరిని పార్లమెంట్‌కు రానిస్తారా? లేదా? అన్న అంశం గురించి చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ వారిద్దరు ఎవరు? వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారా? లేదా? అన్నది తెలియాలంటే ఈ వార్త చదవండి.
పార్లమెంట్‌లో ఉన్న 543 స్థానాలకు అభ్యర్థులెవరో తేలిపోయింది. కొంత మంది సీనియర్లు.. మరికొంత మంది కొత్త వారు ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. మరో ఇద్దరి గెలుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జైలు నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వారే అమృత్‌పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్. పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసులో నిందితుడైన ఇంజినీర్ రషీద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదని రాజకీయ ఉద్ధండులు చెబుతున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.
కేసుల్లో దోషులుగా తేలి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలుశిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.