Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నాయనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నేతల టూర్లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు.. విమర్శలు, ఆరోపణల్లో పదునుపెంచారు నేతలు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు.. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” పై మాట్లాడిన ఆయన.. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో టీడీపీ సింగిల్‌గా 15 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని అర్థమవుతోందని జోస్యం చెప్పారు.. శిశుపాలుడు కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశాడని విమర్శించిన ఆయన.. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే.. జగన్ లక్షల సంఖ్యలో తప్పులు చేశాడన్నారు.. వైసీపీ రికవరీ కావడం కష్టం.. జగన్‌ను ఏపీ ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు.. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీనే. సంక్షేమంతో పాటు.. అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు.
98 శాతం హామీల అమలంటూ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు చంద్రబాబు.. పథకాల్లో భారీగా కోతలేశారు. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. రూ. 50 వేల కోట్లను ప్రజలపై విద్యుత్ భారం వేశారు. ఉచిత విద్యుత్ విషయంలో రైతులనూ ఇబ్బంది పెట్టారని విమర్శించారు.. ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఇసుక సత్యాగ్రహం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.. నా ఇసుకపై నీ పెత్తనం ఏంటీ అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి.. భవిష్యత్తులో వైసీపీ నేతల బట్టలిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హాట్ కామెంట్లు చేశారు. జగన్, పెద్జిరెడ్డి, జే-గ్యాంగ్ రూ. 40 వేల కోట్ల విలువైన ఇసుకను దోచేశారని ఆరోపించారు. పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను విధ్వంసం చేశారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు. రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితికి తెచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి రుణపడి ఉండాలంట.. పుండు మీద కారం జల్లినట్టు ప్రజలు రుణపడి ఉండాలని అంటారా..? ప్రజలు రుణపడి ఉండాలని చెప్పడం అహకారంతో కూడుకున్న ధోరణి.. రుణపడి ఉన్నట్టు బాండ్ రాసివ్వాలా..? ఏ ఒక్కరూ రుణపడి ఉన్నట్టు సంతకాలు చేయొద్దు అని సూచించారు చంద్రబాబు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు.. రుణపడి ఉన్నట్టు సంతకం పెడితే ఏం చేస్తారో..? అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తి జగన్. భరించలేం జగన్.. బై బై జగన్.. ఇదే ప్రతి ఒక్కరి నినాదం కావాలని సూచించారు. బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించాం. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై 13 జిల్లాలు పర్యటించాను. పుంగనూరు, అంగళ్లలో నన్ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. యువగళం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఫ్రస్ట్రేషనుతో ఇలాంటి పని చేస్తోందని మండిపడ్డారు. ప్రజా వేదిక పేరుతో నియోజకవర్గాల్లో నేతలు పాదయాత్రలు చేయాలి.. 3 కోట్ల మంది ఓటర్లకు టచ్ లోకి వెళ్లాలి.. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రజల్లో బలంగా వెళ్లాలి.. కార్యక్రమాలు ఎక్కువగా ఇస్తున్నారనే బాధ వద్దు. ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం కనుకనే వైసీపీ ఆగడాలను అరికట్టగలుగుతున్నాం అన్నారు.
ఇక, జగన్ పని అయిపోయింది.. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం.. మన ఎమ్మెల్యేలను లాక్కొన్నా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నాం అన్నారు చంద్రబాబు.. దేవుడి స్క్రిప్ట్ తిరగరాశాడు.. అదే వైసీపీ పతనమన్న ఆయన.. అర్బన్ ఓటర్లు కాబట్టి గెలిచారంటూ బుకాయించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం చాలా చోట్ల గెలిచాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓట్లు మనకే పడ్డాయి. ఎప్పుడూ రాని పంచాయతీలను గెలుచుకున్నాం. డబ్బుల ప్రభావాన్ని కూడా కాదని.. టీడీపీకే ఓటేశారని తెలిపారు. మరోవైపు.. టీటీడీ సభ్యుల నియామకంపై స్పందించిన చంద్రబాబు. మద్యం స్కాంలో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యునిగా స్థానం కల్పిస్తారా..?అప్రూవరుగా మారడం అంటే.. తప్పుడు పని చేశానని ఒప్పుకోవడమే. అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారు..? అని నిలదీశారు. టీటీడీ సభ్యల నియామకం సహా జగన్ చేస్తున్న అన్ని తప్పిదాలను ప్రజలకు వివరించాలి. పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో 92 మంది చెట్టుకొకరు.. పుట్టకొకరు ఉన్నారు. ఆ 92 మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. మేం ఇబ్బంది పెట్టాలంటే పెట్టగలం అని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.