NTV Telugu Site icon

108 Ambulance: సహకరించని 108 సిబ్బంది.. ప్రైవేటు ఆటోలో ఆస్పత్రికి బాధితురాలి తరలింపు!

108 Ambulance

108 Ambulance

పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్‌ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33) కూలీ పనులకు వెళుతూ భర్తకు అండగా ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగా సాలెమ్మ బుధవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగు మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది ఆమె ఇద్దరు పిల్లలు గమనించి.. పక్క ఇంట్లో ఉన్న బంధువులకు చెప్పారు. వారు వచ్చేసరికి సాలెమ్మ అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే చికిత్స కోసం మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.

Also Read: IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్‌!

సాలెమ్మ కుటుంబ సభ్యులు 108కు కాల్‌ చేయగా.. వాహనంలో డీజిల్‌ లేదని, ఇప్పుడు తాము ఏం చేయలేమని తెలిపారు. దాంతో సాలెమ్మను కుటుంబ సభ్యులు మోమిన్‌పేట నుంచి సదాశివపేట ఆసుపత్రికి ప్రైవేటు ఆటోలో తీసుకెళ్లారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం సాలెమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 108 వాహన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సాలెమ్మ కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే పండగ సందర్భంగా కార్యాలయానికి సెలవు ఉందని, అందుకే 108 వాహనంలో డీజిల్‌ పోయించలేదని సిబ్బంది చెబుతున్నారు.