Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ

  • దిగొచ్చిన మెటా
  • కేంద్రానికి జుకర్‌బర్గ్ క్షమాపణ
  • డీప్‌ఫేక్‌లు, కంటెంట్ లోపాలపై క్షమాపణలు
Meta2

Meta2

ఎట్టకేలకు మెటా దిగొచ్చింది. కేంద్రానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. తప్పు జరిగిందని… డీప్‌ఫేక్‌లు, కంటెంట్ లోపాలపై క్షమాపణలు తెలిపారు.

ఇటీవల ప్రధాని మోడీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే ‘జెన్-జీ అవుట్‌రీచ్’ వీడియోను మెటా తొలగించింది. అయితే సాంకేతిక కారణాలతో డిలీట్ అయిందని వివరణ ఇచ్చింది. అయితే మెటా వివరణపై పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పక పోతే.. మెటాకు చట్టపరమైన రక్షణను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని కమిటీ హెచ్చరించినట్లు సమాచారం. కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో మొత్తానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ దిగొచ్చి కేంద్రానికి క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రత్యేకంగా ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పినట్లుగా కనిపించలేదు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాలల లైంగిక వేధింపుల సామగ్రి (CSAM), డీప్‌ఫేక్‌లు, అల్గారిథమిక్ పాలనలో జరిగిన తీవ్రమైన లోపాలపై జుకర్‌బర్గ్ అధికారికంగా క్షమాపణలు చెప్పి.. విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఆ సంస్థ అంగీకరించింది. మెటా వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఐటీ చట్టం ప్రకారం మధ్యవర్తి నిర్వచనం పరిధిలోకి రావని అధికారులు స్పష్టం చేశారు. ఏ కంటెంట్‌ను ఎవరికి అందించాలో వారే నిర్ణయిస్తారు. అందువల్ల, ఐటీ చట్టం కింద ఉన్న సేఫ్ హార్బర్ రక్షణ వీటికి వర్తించదు.

వర్గాల సమాచారం ప్రకారం.. ప్లాట్‌ఫారమ్‌లో ప్రచారంలో ఉన్న బాలల లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్లాట్‌ఫారమ్ కార్యకలాపాలలో తలెత్తిన వివిధ సాంకేతిక, విధానపరమైన లోపాలకు క్షమాపణలు చెప్పారు. ఒక నిర్దిష్ట రకమైన కంటెంట్‌ను ప్రచారం చేయడానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించినట్లు విచారణ, సమీక్ష సందర్భంగా కంపెనీ అంగీకరించింది. ఈ పొరపాటు పట్ల కంపెనీ, జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేశారు. తాము కేవలం ఒక తటస్థ మాధ్యమం లేదా మధ్యవర్తి మాత్రమే కాదని మెటా స్పష్టం చేసింది. ఏ వినియోగదారులు ఏ కంటెంట్‌ను చూడాలో తామే నిర్ణయిస్తారు కాబట్టి, ఐటీ చట్టం కింద తమకు చట్టపరమైన రక్షణ లభించదని తెలిపింది.