NTV Telugu Site icon

Dhruv Rathee: ఫేక్‌న్యూస్‌పై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై కేసు..

Youtuber Dhruv Rathee

Youtuber Dhruv Rathee

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు బుక్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో నకిలీ వార్తల్ని పేరడీ అకౌంట్‌లో పోస్ట్ చేశాడనే ఆరోపణలపై మహరాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారులు శనివారం తెలిపారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ చెబుతున్న దాని ప్రకారం.. @dhruvrahtee హ్యాండిల్‌తో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో స్పీకర్ ఓం బిర్లా కుమార్తె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షకి హాజరుకాకుండానే పాస్ అయిందని పేర్కొన్నాడు.

Read Also: Khammam: రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్సు.. పసికందు మృతి

బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు యూట్యూబర్‌పై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ల కింద పరువునష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, దుశ్చర్యకు దారి తీసే ప్రకటన, ఐటీ చట్టం కింద కేను నమోదు చేశారు. అయితే పేరడీ అకౌంట్ ద్వారా ఈ ఆరోపణలు పోస్ట్ చేయబడ్డాయని, ఇది ధ్రువ్ రాథీకి చెందినది కాదని చెప్పిన సమయంలో‘‘ మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము’’ అని అధికారి వెల్లడించారు.

పేరడీ అకౌంట్ ద్వారా శనివారం మరో ట్వీట్ పోస్ట్ చేయబడింది. ‘‘@MahaCyber1 నిర్దేశించినట్లుగా, నేను అంజలీ బిర్లాపై నా పోస్ట్‌లు మరియు వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను, వాస్తవాల గురించి నాకు తెలియక మరియు వేరొకరి ట్వీట్‌లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’’ అని ట్వీట్ చేశారు.