NTV Telugu Site icon

YouTube: “తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెట్టారో అంతే సంగతి”.. యూట్యూబ్ కొత్త పాలసీ వివరాలు..

Youtube

Youtube

YouTube: యూట్యూబ్‌ తప్పుడు “థంబ్‌నెయిల్స్”, “టైటిల్స్‌”పై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారుల్ని మోసగించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త పాలసీని తీసుకురాబోతోంది. చాలా సందర్భాల్లో యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ‘‘క్లిక్‌బైట్’’ వీడియోలపై కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి వీడియోలను తొలగిస్తామని ఇండియన్ కంటెంట్ క్రియేటర్లను హెచ్చరించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలు చేసే ప్లాన్‌ని ప్రకటించింది.

తప్పుడు థంబ్‌నెయిల్స్, క్లిక్‌బైట్ హెడ్డింగ్స్ అంటే ఏమిటి..?

థంబ్‌నెయిల్స్, క్లిక్‌బైట్స్ కంటెంట్‌పై వీక్షకుడి ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తాయి. వీడియోని చూసేలా ప్రేరేపిస్తాయి. వీటిని చూడటం వల్ల వీక్షకుడికి క్రియేటర్లు ఏ కంటెంట్ ఇవ్వబోతున్నారనేది అర్థమవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో వీరిని తప్పుదోవ పట్టించేందుకు, సంచలనాల కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్, హెడ్డింగ్స్ పెడుతున్నారు. వీటికి లోపల ఉన్న వీడియోకి అసలు సంబంధం ఉండటం లేదు. ఇలా చేయడం వల్ల వీక్షకుడు తన అమూల్యమైన సమయాన్ని కోల్పోవడంతో పాటు తాను మోసపోయాననే ఫీలింగ్‌లో ఉంటున్నాడు.

Read Also: Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..

యూట్యూబ్ కొత్త పాలసీ ఏం చెబుతోంది.?

అసాధారణ క్లిక్‌బైట్స్ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ చెబుతోంది. వీక్షకులు ఖచ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని కోరుతున్నందున బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్స్‌కి సంబంధించిన కంటెంట్‌ని నిశితంగా పరిశీలిస్తామని యూట్యూబ్ తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించింది.

ఉదాహరణకు ‘‘ ప్రెసిడెంట్ రాజీనామా’’ లేదా ‘‘బ్రేకింగ్ పొలిటికల్ న్యూస్’’ వంటి ఆకర్షణీయమైన టైటిల్స్‌ ఉన్న థంబ్‌నెయిల్స్ పెట్టిన వీడియోలో, దీనికి సంబంధించిన వివరాలు ఉండకుంటే ఇది యూట్యూబ్ రూల్స్‌ని ఉల్లంఘించినట్లే. తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ స్పష్టం చేస్తోంది.

యూట్యూబ్ ఈ చర్యలకు ఎందుకు తీసుకుంటోంది..?

ముఖ్యంగా వార్తలకు సంబంధించిన కంటెంట్ విషయానికి వస్తే, యూట్యూబ్ తన విశ్వసనీయతను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. వీక్షకులు విశ్వసనీయ సమాచారం కోసం యూట్యూబ్‌ని ఆశ్రయించినప్పుడు తప్పుదాడి పట్టించే, హానికరమైన కంటెంట్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కంటెంట్ క్రియేటర్ల క్రియేటివిటీని ప్రోత్సహించడంతో పాటు జవాబుదారీతనం మధ్య బ్యాలెన్స్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Show comments