NTV Telugu Site icon

Supreme Court: ‘నిప్పుతో చెలగాటమాడుతున్నారు’.. పంజాబ్, తమిళనాడు గవర్నర్లకు సుప్రీం వార్నింగ్.

Supreme Court

Supreme Court

Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో జాప్యం చేయడంపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. భారతదేశం ముందు నుంచి వస్తున్న సంప్రదాయాలపై నడుస్తోందని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య ప్రతిష్టంభనపై తాము అసంతృప్తితో ఉన్నామని పేర్కొంది.

పంజాబ్ తో జరుగుతున్న దానిపై తాము సంతోషంగా లేమని, ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల్లో పనిచేయాలని తెలిపింది. బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం గవర్నర్ ఉన్న అంశంపై చట్టాన్ని పరిష్కరించేందుకు షార్ట్ ఆర్డర్ పాస్ చేస్తామని పేర్కొంది.

Read Also: Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?

తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని కూడా సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ వ్యాధి( రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్) పంజాబ్ నుంచి తమిళనాడు వరకు వ్యాపిస్తోందని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బిల్లుల జాప్యంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశం తమ వద్దకు రాకముందే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆప్ ప్రభుత్వం ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 27 బిల్లలుకు 22 బిల్లులకు పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. అయితే అక్టోబర్ 19న మూడు ద్రవ్యవినిమయ బిల్లులను నిలుపుదల చేశారు. తర్వాత నవంబర్ 1న రెండింటికి సమ్మతి ఇచ్చారు. అయితే మూడో ద్రవ్యవినిమయ బిల్లును పరిశీలిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి.