Women Reservation Bill: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. 2012లో ఎస్సీ,ఎస్టీ రిజర్వేష్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. వి నారాయణ స్వామి ఎస్సీ/ఎస్టీల ప్రమోషనల్ కోటాపై బిల్లు పెడుతున్న సమయంలో సమాజ్ వాదీ ఎంపీ యశ్వీర్ సింగ్, అతని చేతి నుంచి బిల్లును లాక్కొని చించేశాడు. ఇదే సమయంలో సోనియాగాంధీ యశ్వీర్ సింగ్ కాలర్ పట్టుకున్నారని దూబే గుర్తు చేశారు.
మీరు నియంత కాదు, రాణి కాదు, మీరు హింసను ఆశ్రయించలేరని నేను ఆమెకు చెప్పానని బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే అన్నారు. ఆ సమయంలో బీజేపీ అక్కడ లేకపోతే సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఉండేవారు కాదని, మీరు ఎంపీలందర్ని చంపేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. 2012లో ఈ ఘటన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్‌పీ)ల మధ్య తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ బిల్లుపై కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎస్‌పీల మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు ఇస్తున్నామని సోనియాగాంధీ ప్రకటించారు. అయితే ఈ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, కులగణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును తీసుకురావడం ఆలస్యమైతే భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది.