Site icon NTV Telugu

Yogi Adityanath: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.. కాంగ్రెస్‌పై యోగి అటాక్..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని.. కాంగ్రెస్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ని ప్రసన్నం చేసుకునేందుకు మత ఆధారిత రిజర్వేషన్లను ఇస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ బలమైన కోట, వొక్కలిగ ఓట్లకు కీలకమైన ప్రాంతం అయిన మాండ్యా నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Read Also: MLC Jeevan Reddy : సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన రూ.10 వేల నష్టపరిహారం ఎక్కడా..?

కేంద్రం, రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల గత ఆరేళ్లుగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 2బి కేటగిరీ కింద ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, మత ఆధారిత కోటాకు రాజ్యాంగపరమైన మద్దతు లేదని అన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల వీటిని రద్దు చేసింది. ఈ 4 శాతం రిజర్వేషన్లను సమానంగా విభజించి వొక్కలిగ, లింగాయత్ వర్గాలకు రెండు శాతం చొప్పున కేటాయించింది.

భారత దేశం 1947లో మత ప్రాతిపదికన విభజించబడింది, దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను ఆమోదించమని, మరొక విభజనకు సిద్ధంగా లేమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్రం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాలు పీఎఫ్ఐ వంటి ఇస్లామిక్ సంస్థల వెన్ను విరిచాయని తెలిపారు. యూపీలో ప్రజల భద్రతకు హామీ ఇచ్చమని, ఇప్పుడు యూపీలో అల్లర్లు, కర్ఫ్యూలు లేవని ఆయన అన్నారు. బీజేపీ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ (ఏక భారత్, గొప్ప భారతదేశం) భావన మాత్రమే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Exit mobile version