మౌలిక సదుపాయల ఆధునీకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ చేయూత అందించనుంది. ఈ మేరకు 245 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1911 కోట్లు) రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ముందుకొచ్చింది. ఏడేళ్ల గ్రేస్ పీరియడ్ సహా 22 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత్ చేపడుతున్న ‘రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్టు’కు ఈ నిధులు వినియోగించనున్నారు. సరకు రవాణా వేగవంతం, ప్రయాణికులను మరింత సురక్షితంగా, వేగంగా గమ్యం చేర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) విభాగం నుంచి ఈ రుణం మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది.
కాగా మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి ప్రపంచంలో నాల్గో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. కానీ ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతోంది. భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు రవాణా రంగంలో పురోగతికి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా మారుతోంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే కావడం గమనార్హం. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే అనే ఓ నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని భారతీయ రైల్వేలు యోచిస్తున్నాయి. దీని కోసం మౌలిక సదుపాయాలను ఇండియన్ రైల్వేస్ పెంచుకుంటున్నాయి.