Worker Can Not Take Up Moonlighting As Per Rule says Labour Minister In Parliament: ఈ మధ్య ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘మూన్‌లైటింగ్’’. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని మూన్‌లైటింగ్ గా పేర్కొంటారు. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్‌లైటింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. మూన్‌లైటింగ్ పద్దతిని విడనాడకుంటే తాము కూడా ఇదే విధంగా వ్యవహారించాల్సి ఉంటుందని మిగతా కంపెనీలు కూడా ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా మూన్‌లైటింగ్ పై కేంద్రమంత్రి పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. చట్టపరంగా ఒక కార్మికుడు తన ఉద్యోగంతో పాటు యజమాని ఆసక్తికి వ్యతిరేకంగా ఏ విధమైన పనిని చేయకూడదని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని చాలా మంది ఐటీ ఉద్యోగులు మూన్‌లైటింగ్ కి పాల్పడ్డారు.
Read Also: Umair Sandhu: చిరంజీవిని అంకుల్ అన్న ప్రముఖ క్రిటిక్.. మెగా అభిమానుల ఫైర్
అయితే ఉద్యోగుల తొలగింపుకు మూన్‌లైటింగ్ కారణం అని ప్రభుత్వం భావిస్తుందా..? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రియల్ ఎంప్టాయిమెంట్(స్టాండర్డ్ ఆర్డర్స్)చట్టం 1946 ప్రకారం.. ఒక కార్మికుడు తను ఉద్యోగం చేస్తున్న సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. అతని ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగం చేయకూడదు. సంస్థ యజమాని ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇది ఉంటుందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపు అనేది సంస్థల్లో సాధారణం అని.. దేశంలో మూన్‌లైటింగ్ పై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందా..? అనే ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చారు.
మూన్‌లైటింగ్ కారణంగా ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించిందా..? అనే ప్రశ్నకు సంబంధించి ఐటీ, సోషల్ మీడియా, ఎడ్టెక్ సంస్థలు, సంబంధిత రంగాల్లో మల్లీనేషనల్ కంపెనీలు, భారతీయ కంపెనీల విషయంలో అధికార పరిధి ఆయా రాష్ట్రప్రభుత్వాలదే అని మంత్రి పేర్కొన్నాడు. పారిశ్రామిక వివాదాల చట్టం-1947 ప్రకారమే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆయన అన్నారు.