Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత జూన్ 1న లొంగిపోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్ గుర్తుకు ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని ఆయన ప్రజల్ని కోరారు.
Read Also: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!
50 రోజుల తర్వాత జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల కావడాన్ని ఆప్ ఈ ఎన్నికల్లో కీలక మలుపుగా భావిస్తోంది. ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా మోతీ నగర్‌లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘‘నేను తిరిగి జైలుకు వెళితే, బీజేపీ మీకు అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుంది. ఉచిత విద్యుత్, పాఠశాలల పరిస్థితి దిగజారుతుంది. మొహల్లా క్లీనిక్స్ మూతపడుతాయి.’’ అని కేజ్రీవాల్ అన్నారు. నేను మీ కోసం పనిచేసినందుకే నన్ను జైలుకు పంపారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని ప్రజలకు తాను సేవ చేయడం ఇష్టం లేదని చెప్పారు.
ఢిల్లలోని ఏడు నియోజకవర్గాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఈ సారి ఎన్నికల్లో ఆప్ గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇప్పటికే ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి.
