Instagram Reels: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి పలువురు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. కాలక్షేపంగా చేయాల్సిన ఇలాంటి పనులు వ్యసనంగా మారుతున్నాయి. కొందరు 24 గంటలు రీల్స్ మత్తులోనే మునిగిపోతున్నారు. తన రీల్స్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయనేది చూస్తున్నారు. చివరకు ఎలా తయారైందంటే ఇన్‌స్టా రీల్స్ చివరు కుటుంబాల్లో గొడవలకు, హత్యలకు కారణమవుతున్నాయి.
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు ఏకంగా ఓ భార్య తన భర్తను గొంతుకోసి కిరాతకంగా చంపేసింది. సదరు మహిళ రీల్స్ చేస్తుండగా భర్త వ్యతిరేకించారు, దీంతో కోపంతో ఉన్న భార్య, అతని అత్తామామలతో కలిసి హత్య చేసింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Read Also: Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ
బెగుసరాయ్ ప్రాంతంలోని ఖోడాబంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహేశ్వర్ అనే వ్యక్తి కోల్‌కతాలో కూలీగా పనిచేస్తుండేవాడు. సమస్తిపూర్ జిల్లాలోని నర్హన్ గ్రామానికి చెందిన ఇతను కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అతని భార్య రాణి కుమారి ఇన్‌స్టాలో వీడియో చేసింది. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. రాణికుమారికి 7 ఏళ్ల క్రితం మహేశ్వర్‌తో వివాహం అయింది.
అయితే గొడవ తర్వాత రాణి తల్లిదండ్రుల గ్రామం ఫఫౌట్‌కి వెళ్లింది. మహేశ్వర్ కూడా అక్కడికి వెళ్లాడు. మరోసారి ఇన్‌స్టా విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. దీంతో రాణి, ఆమె తల్లిదండ్రులు మహేశ్వర్ గొంతు కోసి హత్య చేశారు. కోల్‌కతా నుంచి మృతుడి సోదరుడు ఫోన్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ తిరిగి కోల్‌కతాకు వెళ్లబోతున్న సమయంలోనే ఈ హత్య జరిగింది.