NTV Telugu Site icon

Maharashtra: అడవిలో గొలుసులతో బందీగా అమెరికా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి..

Maharahtra

Maharahtra

Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా మహిళ గత కొన్ని రోజులుగా సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో గొలుసులతో ఒక చెట్టుకు నిర్బంధించబడి ఉంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల లలితా కయీ కుమార్ ఎస్ అనే మహిళ తమిళనాడులో నివసిస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త అటవీలో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సింధుదుర్గ్ ‌లోని సోనుర్లి గ్రామ సమీపంలో ఆమె అత్యంత దయనీయ స్థితిలో శనివారం ఓ గొర్రెల కాపరికి కనిపించింది. ఆమె ఏడుపు వినిపించడంతో అటువైపు వెళ్లి చూడగా, ఆమెను గొలుసులో బంధించబడి ఉండటాన్ని చూసిన అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను రక్షించిన పోలీసులు ప్రథమ చికిత్స కోసం సింధుదుర్గ్ లోని సావంత్‌వాడి తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓరోస్‌లోని ఆస్పత్రికి తరలించారు.

Read Also: Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ఆమెకు చికిత్స అందించిన వైద్యుల ప్రకారం.. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె తన ఆరోగ్య సమస్యల గురించి కాగితంపై రాసి తమతో చెప్పినట్లు వారు చెప్పారు. ఆమె 40 రోజులుగా ఆహారం తినకుండా ఉందని తెలిసింది. భర్తతో గొడవ పడటంతో అతను తనను అడవీలో బంధించినట్లు వెల్లడించారు. మహిళ స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కొన్ని రోజులుగా ఏమీ తినకపోవడంతో బలహీనంగా ఉందని, అలాగే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆమెని ఎంత కాలంగా బంధించి ఉంచారో తెలియదని, దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె దగ్గర తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, అమెరికా పాస్‌పోర్టు కాపీని కనుగొన్నట్లు వెల్లడించారు. ఆమె ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌తో టచ్‌లో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు ప్రాథమికంగా లభించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ గత 10 ఏళ్లుగా భారత్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు.