Wolf Attack: ఉత్తర్ ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ తోడేళ్ల దాడుల వల్ల బహ్రైచ్ జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. నరమాసానికి మరిగిన తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి, 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ, ఈ దాడులను అడ్డుకట్ట పడటం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా 13 ఏళ్ల బాలుడిపై తోడేళ్ల దాడి జరిగింది. మహసీ ప్రాంతంలోని పిప్రి మోహన్ గ్రామంలో ఆదివారం రాత్రి అర్మాన్ అలీ అనే బాలుడిపై దాడి జరిగింది. దాడి సమయంలో బాలుడి మెడకు గాయమైంది మరియు వెంటనే ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి తదుపరి సంరక్షణ కోసం బహ్రైచ్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఇంటి టెర్రస్‌పై బాలుడు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Read Also: TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!
ఇదిలా ఉంటే, ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ మహసీ తాహసీల్‌లోని సిసయ్య చురామణి గ్రామాన్ని సందర్శించారు. తోడేళ్ల దాడులకు గురైన బాధితులతో సమావేశమై, పరామర్శించారు. ఆరు తోడేళ్ల గుంపు ఉత్తరప్రదేశ్‌లోని 50 గ్రామాలను భయభ్రాంతులకు గురి చేయడంతో తోడేళ్ల సంక్షోభం ప్రారంభమైంది. అటవీ శాఖ ఐదు తోడేళ్లను పట్టుకోగా, ఒకటి ఇప్పటి వరకు చిక్కలేదు. ఇవి ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను, ఒక మహిళ ప్రాణాలను తీశాయి. మరో 51 మంది గాయపడ్డారు. జూలై నుంచి బహ్రైచ్‌లో వరసగా దాడులు జరిగుతున్నాయి. దీంతో తోడేళ్లను పట్టుకునేందుకు ‘‘ఆపరేషన్ భేదియా’’ని ప్రారంభించారు. 165 మందికి పైగా అటవీ సిబ్బంది మరియు 18 మంది షూటర్‌లను ఆ ప్రాంతంలో మోహరించారు.