NTV Telugu Site icon

Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మంగళవారం ఆరోపించింది. ఈ అరెస్టును హిందువులపై వేటగా అభివర్ణించింది.

‘‘కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హిందూ కార్యకర్తలను అవమానకరంగా లక్ష్యంగా చేసుకుంటుంది. కరసేవక్ శ్రీకాంత్ పూజారిని 31 ఏళ్ల నాటి నకిలీ కేసులో అరెస్ట్ చేసింది. హిందువులు రామమందిరాన్ని జరుపుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ పిరికిచర్య రామమందిరంపై వాస్తవాన్ని అంగీకరించానికి నిరాకరిస్తుంది. హిందువులపై జరుగుతున్న ఈ వేటని ఖండిస్తున్నాము’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: JN.1 Cases: దేశవ్యాప్తంగా 263 కోవిడ్ JN.1 కేసులు.. ఒక్కరాష్ట్రంలోనే సగం కేసులు..

1992లో బాబ్రీ మసీదు కూల్చేవేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన అల్లర్లలో 50 ఏళ్ల వ్యక్తి శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని హుబ్బళ్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాబ్రీ ఘటన సమయంలో అతనికి 20 ఏళ్లు. అయితే ఈ అరెస్టుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఇది రాజకీయ ద్వేషం కానది, నేరానికి పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవడమే అని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాం.. నేరం చేసిన వ్యక్తి వదిలేద్దామా..? అని సీఎం ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసని, 2006 నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉందని, గత మూడు నెలల్లో ఇలాంటి 37 కేసుల్ని ఛేదించామని, ఇది అందులో ఒకటని, బాబ్రీ కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లలో పూజారి పాల్గొన్నాడని అధికారి తెలిపారు.