Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వివాదాస్పద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని సమర్థించబోమని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు.
‘‘రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు భారతదేశ రిజర్వేషన్లను ముగించాలని అనుకున్నాడు. ఇది కాంగ్రెస్ అసలు ముఖాన్ని బట్టబయలు చేసింది’’ అని గైక్వాడ్ వివాదాస్పద ప్రకటన ముందు మీడియాతో అన్నారు. రిజర్వేషన్లను అంతం చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన అని, ఎన్నికల్లో బాబా సాహెబ్ అంబేద్కర్‌ని కూడా కాంగ్రెస్ ఓడించిందని ఆయన అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రజలకు చేసిన అతిపెద్ద ద్రోహమని, మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు వంటి వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని, అయితే అంతకంటే ముందే రిజర్వేషన్ల ప్రయోజనాలను అంతం చేయడం గురించి గాంధీ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తూ, బీజేపీ దానిని మారుస్తుందని బూటకపు కథనాన్ని ప్రచారం చేశారని, అయితే దేశాన్ని 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తుందని ఎమ్మెల్యే గైక్వాడ్ మండిపడ్డారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థించను, ఆమోదించనని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ అన్నారు. గతంలో రిజర్వేషన్లు ఇవ్వడం అంటే మూర్ఖులకు మద్దతు ఇవ్వడమని రాజీవ్ గాంధీ అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నెహ్రూ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అవగాహన కల్పిస్తామని, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే కూడా ఆలోచించాలని బీజేపీ నేత చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు. మరోవైపు గైక్వాడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. సమాజంలో రాజకీయాల్లో జీవించే అర్హత అతడికి లేదని అన్నారు.