Site icon NTV Telugu

Delhi Election Results: బీజేపీ వస్తుందా.. ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా..

Delhi

Delhi

Delhi Election Results: దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ గత వైభవాన్ని సాధిస్తుందా..? లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) హ్యాట్రిక్ కొడుతుందా.? అని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని సాధించి 26 ఏళ్లు అవుతోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గత రెండు సార్లు అధికారాన్ని సాధించింది. ఈసారి మాత్రం విజయం అంత సులువు కాదనే భావన అందరిలో ఉంది.

Read Also: Delhi Election Results 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్..

ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అని బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో, 50కి పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విశ్వాసాన్ని ఆప్ నేత గోపాల్ రాయ్ కూడా చెబుతున్నారు. తాము 50 సీట్లు గెలుస్తామని అన్నారు. మరోవైపు శుక్రవారం కేజ్రీవాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ తన ఎమ్మెల్యేలకు రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవుల్ని ఆఫర్ చేస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేతలు చేసిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా దర్యాప్తుకు ఆదేశించిన వెంటనే ఏసీబీ రంగంలోకి దిగింది.

ఇదిలా ఉంటే, ఈ రోజు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం అంతా సిద్ధమైంది. దేశ రాజధానిలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, ఢిల్లీ తన ఆధిపత్యాన్ని ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 67 స్థానాలను గెలుచుకుంది. 2020లో ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి 62 సీట్లు గెలుచుకుంది. గత రెండు సార్లు బీజేపీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా, గెలవలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీని గత మూడుసార్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పటీకీ అసెంబ్లీలో గెలుపుమాత్రం ఆ పార్టీని ఊరిస్తూనే ఉంది. ఈ సారి బీజేపీ తన గెలుపుపై చాలా ధీమాగా ఉంది.

Exit mobile version