Delhi High Court: భర్తపై నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అతడిని ‘స్త్రీలోలుడి’గా చిత్రీకరించడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట అని, ఇది వివాహ రద్దుకు కారణమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం భర్త దాఖలు చేసిన క్రూరత్వానికి సంబంధించిన విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలని, అవసరమైన సమయాల్లో రక్షణ కవచంలా ఉండాలని ఆశిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: EAM S Jaishankar: కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు చోటు.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తోంది..
ఏదైనా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా నిర్మించబడుతుందని, ఒక స్థాయికి మించి రాజీ పడితే ఆ బంధానికి ముగింపు అనివార్యమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ కేసులో భార్య, భర్త ఆఫీసు మీటింగ్స్‌లో, ఆఫీస్ సిబ్బంది ముందు ఆరోపణలు చేయడం, బహిరంగంగా వేధించడం, అవమానించడం, మాటలతో దాడి చేయడం వంటి సంఘటనలు ఉన్నాయని, చివరకు భార్య ఆఫీసులోని మహిళా ఉద్యోగులపై కూడా వేధింపులకు పాల్పడిందని, భర్తను ‘ఉమెనైజర్’గా చిత్రీకరించడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని, ఇలాంటి చర్యలు భర్త పట్ల భార్య క్రూరమైన చర్య అని హైకోర్టు చెప్పింది. విడాకులకు వ్యతిరేకంగా భార్య వేసిన పిటిషన్‌ని ధర్మాసనం తోసిపుచ్చింది.
భర్త స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధాన్ని అంటకట్టడం అనేది క్రూరత్వానికి పరాకాష్ట అని.. ఇది ఇతర జీవిత భాగస్వామి ప్రతిష్టను దిగజార్చడమే అని, అత్యంత క్రూరమైన చర్య తప్ప మరోటి కాదని కోర్టు పేర్కొంది. తన భర్త నపుంసకుడని భార్య పేర్కొంటూ.. అతను ఫిట్‌గా ఉన్నాడని గుర్తించేందుకు పొటెన్సీ టెస్ట్ చేయించుకోమని ఒత్తిడి చేయడం, అతనిపై మానసిక క్రూరత్వానికి గురిచేశాయని, భార్య తన బిడ్డను కూడా భర్త నుంచి దూరం చేసిందని, ఇది మానసిక క్రూరత్వమే అని కోర్టు పేర్కొంది. భార్యభర్తలు కలిసి ఉన్న 6 ఏళ్లు భర్త వేధింపులకు గురయ్యాడని రుజువు చేసిందని కోర్టు పేర్కొంది.