NTV Telugu Site icon

Bangladesh-Pakistan: పాక్ నుంచి బంగ్లాదేశ్‌కి కార్గో షిప్..ఎందుకంత ప్రత్యేకం..?

Bangladesh Pakistan

Bangladesh Pakistan

Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ “ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు”గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.

ఈ ఏడాది ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆగస్టు 05న షేక్ హసీనా భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆమె తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమించబడ్డాడు. ఆయన వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది.

అయితే, 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్( ఇప్పటి బంగ్లాదేశ్) విముక్తి ఉద్యమం సందర్భంగా దాదాపుగా 30 లక్షల మంది బంగ్లా ప్రజల్ని పాక్ ఆర్మీ ఊచకోత కోసింది. ఈ విషాదాన్ని మరిచిపోయిన బంగ్లా ప్రస్తుత పాలకులు, పాకిస్తాన్‌తో సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్తాన్ తన నేరాలకు ఇప్పటి వరకు క్షమాపనలు చెప్పలేదు, విచారం వ్యక్తం చేయలేదు. కొన్ని సందర్భాల్లో బంగ్లా యుద్ధ నేరాలను భారత్ వైపు మళ్లించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. జిన్నా పాకిస్తాన్ కలల్ని భగ్నం చేయడానికే భారత్ కుట్ర చేసిందని ఆరోపించింది.

Read Also: PCC chief Mahesh Goud: పదేళ్ల బీఆర్‌ఎస్‌ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్

షేక్ హసీనా హయాంలో భారత్‌కి పూర్తి మద్దతుగా ఉంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆమె పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో 1971 యుద్ధ నేరాలకు సహకరించిన వారిని విచారించింది. ఆమె 2010లో యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ‘‘జమాతే ఇస్లామీ’’ వంటి సంస్థల్ని నిషేధించింది. జమాత్ నాయకుడు అబ్దుల్ క్వాదర్ మొల్లా 344 మంది పౌరుల్ని చంపినందుకు గానూ దోషిగా నిర్ధారించింది. హసీనా పాలనలో ఇతడిని ఉరితీశారు. ఆ సమయంలో పాక్ మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ మాట్లాడుతూ.. మొల్లాని ఉరితీయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు.

1975లో షేక్ హసీనా తండ్రి బంగ్లా జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహ్మన్ హత్య తర్వాత హసీనాకు న్యూఢిల్లీ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె భారత్‌లోనే ఉంది. ఎప్పుడైతే ఆమె అధికారం కోల్పోయిందో, యూనస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ప్రస్తుతం సెక్యులర్ ‌గా ఉన్న బంగ్లాదేశ్, ఇస్లామిక్ రాజ్యం దిశగా అడుగులేస్తోంది. రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని అక్కడ ప్రభుత్వ పెద్దలే కోరుతున్నారు. యూనస్ ప్రభుత్వం జమాతే ఇస్లామీపై బ్యాన్ ఎత్తేసింది. పలువురు ఉగ్రవాదుల్ని జైళ్ల నుంచి రిలీజ్ చేసింది.

Show comments