Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా మెజారిటీ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూలో బీజేపీకి గణనీయమైన సీట్లు వస్తాయని, కాశ్మీర్‌లోయలో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తాయని చెప్పాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో వైరి పక్షాలు చేతులు కలిపేలా కనిపిస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న ఎన్సీ, పీడీపీలు అధికారం కోసం జతకట్టే అవకాశం ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆదివారం మాట్లాడుతూ.. అవసరమైతే ముఫ్తీకి చెందిన పీడీపీ మద్దతుతో జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పీడీపీ నుంచి మద్దతు తీసుకుంటారా..? అని అడిగిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు.
Read Also: Hezbollah: ఆ బాధ్యతలు తీసుకుంటే ఇజ్రాయిల్ చేతిలో చావే.. హిజ్బుల్లా చీఫ్ పదవిని చేపట్టేందుకు భయం..
‘‘మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తే, రాష్ట్ర ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం, నిరుద్యోగం తొలగించడం, గత 10 సంవత్సరాలలో సంభవించిన అన్ని కష్టాలను తొలగించడం చేయవచ్చు. మనం చేయవలసిన మొదటి పని పునరుద్ధరించడం పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించడం. ఎన్నికల్లో ఏది నిజం, ఏది నిజం కాదో చెప్పే హక్కు ఉండాలి, మేము ఎన్నికల్లో ప్రత్యర్థులం.. కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాంగ్రెస్‌కి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
ఇదిలా ఉంటే, ఫరూఖ్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముఫ్తీ పార్టీ మద్దతు వార్తల్ని ఊహాగానాలుగా కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా తర్వాత పీడీపీ ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తుందనే వార్తలు వచ్చాయి. పీడీపీ నాయకురాలు మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ కూడా అనవసర ఊహాగానాలుగా ఈ వార్తల్ని కొట్టిపారేశారు. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. రేపటితో జమ్మూ కాశ్మీర్‌లో గెలిచేది ఎవరో తెలుస్తుంది.