NTV Telugu Site icon

Maldives: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు అర్థమైంది.. ఏడాదిలోనే ఎంత మార్పు..?

Maldives

Maldives

Maldives: ‘‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు భారతదేశ శరణు కోరేందుకు వచ్చాడు. ఏడాది క్రితం చైనాను చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జూకి, అక్కడి ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చే సమయానికి ఇండియా గుర్తుకు వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయి, దివాళాకు దగ్గరగా ఉన్న తమను రక్షించాలని భారత్‌ని కోరారు. ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు.. భారత్‌ని ద్వేషించే స్థాయి నుంచి.. ఓ విధంగా చెప్పాలంటే అడుక్కునే స్థాయికి దిగజారారు. ముయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాల నుంచి మళ్లీ భారత్‌ని ప్రశంసించే స్థాయికి వచ్చింది.

2023 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో మాల్దీవుల్లో ఇండియా వ్యతిరేక సెంటిమెంట్‌ని తీసుకువచ్చి ముయిజ్జూ గెలిచాడు. భారత్ విరాళంగా ఇచ్చిన నిఘా హెలికాప్టర్లతో సహా, ఈ హెలికాప్టర్లను నిర్వహిస్తున్న 80 మంది భారతీయ సిబ్బంది ఆ దేశాన్ని వదలి వెళ్లేదాకా పట్టుబట్టాడు. అధికారంలోకి రాగానే చైనా పర్యటన పెట్టుకుని, ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు. నిజానికి ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా, గెలిచిన తర్వాత తన తొలి పర్యటనను ఇండియాలో పెట్టుకుంటాడు. కానీ దీనికి విరుద్ధంగా ముయిజ్జూ చైనా, టర్కీల్లో పర్యటించాడు.

Read Also: Pakistan: పాక్‌లో బలూచ్ మిలిటెంట్లు చైనానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? భారత్ హస్తముందా..?

ఈ ఏడాది లక్షదీవుల పర్యటనకు ప్రధాని వెళ్తే, ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు కొందరు అసభ్యకరమైన విమర్శలు చేశారు. ఫలితంగా మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకులు తగ్గిపోయారు. చాలా ట్రావెల్ ఫ్లాట్‌ఫారమ్స్ మాల్దీవుల బుకింగ్స్‌ని నిలిపేశాయి. ఈ సమయంలో కూడా ఆ దేశం చైనా నుంచి తమ దేశానికి పర్యాటకుల్ని పంపాలని కోరింది. భారత్‌తో మాకు అసవరం లేదనట్లుగా వ్యవహరించింది. అయితే, చైనా నుంచి పర్యాటకులైతే వచ్చారు, కానీ వారు భారతీయులు ఖర్చు చేసేలా ఖర్చు పెట్టకపోవడంతో అసలు విషయం బోధపడింది. తిరిగి చూసే సరికి ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం రెండూ కుప్పకూలాయి. మాల్దీవులు ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడింది. కోవిడ్ సమయంలో కూడా మాల్దీవుల్ని ఆదుకుండి భారతీయ పర్యాటకులే.

ఇప్పుడు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 110 శాతం బాహ్య రుణాలే ఉన్నాయి. మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వలు 440 మిలియన్లకు పడిపోయాయి. ఆరు వారాల దిగుమతులకు మాత్రమే ఇవి సరిపోతాయి. ఓ విధంగా చెప్పాలంటే శ్రీలంక పరిస్థితులు మాల్దీవులకు వచ్చాయి. సరిగ్గా అప్పుడే భారత్ గుర్తుకు వచ్చింది. ముయిజ్జూ భారత పర్యటనకు వచ్చే ముందు మాట్లాడుతూ..‘‘ మా అతిపెద్ద అభివృద్ధి భాగస్వాముల్లో ఒకరు భారత్, మా ఆర్థిక ఇబ్బందుల గురించి వారికి తెలుసు. భారతదేశం మా భారాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పాడు.

ఊహించనట్లుగానే భారత్, సోమవారం నాడు 100 మిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్లుల చెల్లింపును పొడగించడం ద్వారా నగదు కొరతతో ఉన్న మాల్దీవులకు ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోడీతో ముయిజ్జూ జరిపిన చర్చల తర్వాత 400 మిలియన్ డాలర్లను, రూ. 3000 కోట్ల కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన తర్వాత భారత పర్యాటకులు మాల్దీవులకు వెళ్లే సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. పలు ట్రావెల్ ప్లాట్‌ఫారమ్స్ కూడా మాల్దీవుల బుకింగ్స్‌ని తిరిగి ప్రారంభించాయి.